మండలి వద్దన్నారుగా-ఎమ్మెల్సీ ఓట్లెలా అడుగుతారన్న చంద్రబాబు-టీడీపీ నేతలకు కీలక సూచన..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లులకు మద్దతివ్వలేదనే కారణంతో మండలి రద్దుకు గతంలో సిఫార్సు చేసింది. అయితే ఆ తర్వాత ఏడాది నుంచి మండలికి జరుగుతున్న ప్రతీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తూ సీట్లు సాధిస్తోంది. దీంతో ఇప్పుడు తాజాగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ ఓట్లు అడగటంపై విపక్ష నేత చంద్రబాబు ఫైర్ అయ్యారు.
నాడు శాసన మండలి రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన జగన్ కు ఇప్పుడు పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు ఎక్కడిదని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. తన మాట నెగ్గలేదనే అహంకారంతో నాడు ఏకపక్షంగా జగన్ మండలి రద్దుకు తీర్మానం చెయ్యలేదా అని ప్రశ్నించారు. శాసన మండలి వల్ల ప్రజా ప్రయోజనం లేదని, ట్రెజరీ నుంచి ఒక్క రూపాయి ఖర్చు పెట్టడం కూడా దండగే అని సిఎం జగన్ అనలేదా అని చంద్రబాబు ప్రశ్నించారు.

మండలి లాంటి వ్యవస్థలను అగౌర పరిచిన ముఖ్యమంత్రి.. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలబెట్టి...ఓట్లు అడుతారని చంద్రబాబు నిలదీశారు. పట్ట భద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నికలపై పార్టీ ఇంచార్జ్ లు, ముఖ్యనేతలతో చంద్రబాబు ఆన్ లైన్ లో సమావేశం అయ్యారు. నేతలంతా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుతం తీవ్ర ప్రభుత్వ వ్యతిరేక ఉందని, అదే సమయంలో టీడీపీకి అనుకూలంగా పరిస్థితి ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో వచ్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించాలని చంద్రబాబు నేతలకు సూచించారు.
ఈ ఎన్నికలు ఇంచార్జ్ లు, నేతల పనితీరుకు, సమర్థతకు పరీక్షగా ఉండబోతున్నాయని చంద్రబాబు తెలిపారు. తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్, పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్
ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి వి.చిరంజీవి రావులను గెలిపించాలని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు. పాలనలో అన్ని విధాలా విఫలమైన సీఎం జగన్ ఇప్పుడు తీవ్ర అసహనంతో ఉన్నాడని, అందులో భాగంగానే రాష్ట్రంలో టీడీపీ నేతల పర్యటనలు, సభలపై ఆంక్షలు పెడుతున్నారని అన్నారు.
తాజా గన్నవరం దాడులు జగన్ ఆలోచనలకు, మనస్తత్వానికి నిదర్శనమని చంద్రబాబు విమర్శించారు. ప్రజల్లో మార్పు వచ్చి...ప్రభుత్వ వ్యతిరేక గళం వినిపిస్తుండడంతో...దాడులు, హింసా ఘటనలతో భయపెట్టాలనే ప్రయత్నాలు మొదలు పెట్టారని అన్నారు. కరుడుగట్టిన ఉగ్రవాదిలా సిఎం ప్రవర్తిస్తుంటే...కొందరు పోలీసులు బాధ్యత మరిచి జగన్ కు ఊడిగం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. గన్నవరంలో పోలీసుల సమక్షంలో, సహకారంతో దాడులు జరగడం, పైగా బాధితులపైనే హత్యాయత్నం వంటి కేసులు పెట్టడం జగన్ సైకో పాలన కు నిదర్శనం అని చంద్రబాబు విమర్శించారు.












Click it and Unblock the Notifications