అమరావతి పనుల్లో ఆ రెండూ కావాలంటున్న చంద్రబాబు..!
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు ఇవాళ మరోసారి సమీక్ష నిర్వహించారు. రాజధానిలో నిర్మాణ పనుల పురోగతి ఎలా ఉంది, భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల పంపిణీ, ఇతర అంశాలపై సీఆర్డీఏ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఎం వారికి కీలక ఆదేశాలు ఇచ్చారు. జాప్యం లేకుండా రాజధాని నిర్మాణ పనులు జరగాలని, నిర్దేశించుకున్న సమయానికి పనులు పూర్తి కావాలని అధికారుల్ని ఆదేశించారు.
రాజధాని నిర్మాణ పనుల పురోగతి, బ్యూటిఫికేషన్, రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ వంటి అంశాలపై ఇవాళ క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఏయే నిర్మాణాలను ఎంత వరకు పూర్తి చేశారు..? వర్క్ ఫోర్స్ ఏ మేరకు ఉంది..? నిర్మాణాలకు అవసరమైన మెటీరియల్, మెషినరీని ఆయా సంస్థలు ఏ మేరకు సమకూర్చుకున్నాయనే దానిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏయే భవనాలను ఎప్పటిలోగా పూర్తి చేయాలో నిర్ధిష్ట సమయాన్ని నిర్దేశించుకున్నామని, ఆ మేరకు పనులను పూర్తి చేయాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు.

నిర్మాణాల్లో వేగంతో పాటు, నాణ్యత ప్రమాణాలను పక్కాగా పాటించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.పనుల పురోగతిపై ప్రతి 15 రోజులకోసారి సమీక్షిస్తానని చెప్పారు. ప్రస్తుతం వర్షాల కారణంగా నిర్మాణ పనుల్లో కొంత మేర జాప్యం జరిగినా, రానున్న రోజుల్లో దాన్ని భర్తీ చేసేలా నిర్మాణాల్లో వేగం పెంచాలని సూచించారు. ఇంకా కొన్ని నిర్మాణ సంస్థలు వర్క్ ఫోర్స్, మెషీనరీని పూర్తి స్థాయిలో కేటాయించలేదని, ఇలా ఉన్న సంస్థలు తమ పనితీరు మెరుగుపరుచుకోవాలని కోరారు. ఇక రాజధాని భవనాల నిర్మాణాలకు అవసరమైన గ్రావెల్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్నారు. ఈ మేరకు గనుల శాఖతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.

మరోవైపు రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎంతవరకు పూర్తైందని సీఎం ఆరా తీశారు. రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ల విషయంలో రైతులకు ఏ మాత్రం ఇబ్బందులు రానివ్వొద్దని మంత్రి నారాయణ, అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన వివరాలు అధికారులు అందించారు. ఇంకా 2,471 మంది రైతులకు రిటర్నబుల్ ప్లాట్లను రిజిస్ట్రేషన్లు చేయాల్సి ఉందని.. ఇవి కూడా చిన్నపాటి సాంకేతిక, రైతుల వ్యక్తిగత అంశాల కారణంగా పెండింగులో ఉన్నాయని అధికారులు తెలిపారు. తాను కూడా త్వరలోనే రాజధాని రైతులతో సమావేశమవుతానన్నారు. రాజధానిలో నిర్మాణాలకు ఎంతటి ప్రాధాన్యమిస్తున్నామో..గ్రీనరీ, సుందరీకరణ, పరిశుభ్రతకు కూడా అంతే ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications