తెలంగాణకు ప్రత్యేకంపై బాబు కసరత్తు: సీతక్క ఆగ్రహం
హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో వరుసగా శాసన సభ్యులు పార్టీ వీడుతుండటంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 'ప్రత్యేక' దృష్టి సారించారు. పార్టీ సీనియర్ నేత, టిటిడిపి ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర రావు కాంగ్రెసులోకి వెళ్తారనే ప్రచారం జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు తెలంగాణ ప్రాంత నేతలతో భేటీ అయి, తెలంగాణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కసరత్తు చేస్తున్నారు.
అయితే ఈ కమిటీ సమన్వయ కమిటీనా లేక పూర్తిస్థాయి కమిటీనా అనే విషయమై చంద్రబాబు నేతలతో చర్చలు జరుపుతున్నారు. కమిటీ అధ్యక్షుడి రేసులో ఎల్ రమణ, మోత్కుపల్లి నర్సింహులు, తలసాని శ్రీనివాస్ యాదవ్, రమేష్ రాథోడ్, రేవూరి ప్రకాశ్ రెడ్డి తదితరులు ఉన్నారు.

వస్తుంటారు.. పోతుంటారు: సీతక్క
తెలుగుదేశం పార్టీలోకి ఎందరో వస్తుంటారు... పోతుంటారని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఎర్రబెల్లి దయాకర రావు పార్టీని వీడరని చెప్పారు. సత్యవతి రాథోడ్, కడియం శ్రీహరి వంటి వారు ఎప్పుడు ఉద్యమాలు చేశారో చెప్పాలన్నారు. సత్యవతి రాథోడ్ ఆత్మవంచన చేసుకోవద్దన్నారు.
కాగా, టిడిపిని వీడుతారని ప్రచారం సాగుతున్న ఎర్రబెల్లి దయాకర రావు ఈ రోజు మధ్యాహ్నం తన కార్యకర్తలతో భేటీ అయిన అనంతరం తెలంగాణ టిడిపి ఫోరం నేతగా రాజీనామా చేసే అవకాశాలున్నాయంటున్నారు. ఆ తర్వాత ఒకటి రెండు రోజుల తర్వాత పార్టీని వీడుతున్నట్లు ప్రకటించే అవకాశాలున్నాయంటున్నారు.












Click it and Unblock the Notifications