జగన్ లాంటి వాళ్లతో రాజకీయం..! ఎంపీల భేటీలో చంద్రబాబు నిర్వేదం..!
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయింది. రాష్ట్రంలో ప్రభుత్వం పటిష్టంగా ఉంది. మరో నాలుగేళ్ల పాలన మిగిలే ఉంది. అయినా నిత్యం విపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాష్ట్ర ప్రభుత్వంపై ఏదో విషయంలో విమర్శలు చేస్తూనే ఉన్నారు. వీటిపై ఇవాళ సీఎం చంద్రబాబు టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో మరోసారి స్పందించారు. క్రిమినల్స్ తో రాజకీయాలు చేయాల్సి వస్తోందంటూ వ్యాఖ్యానించారు.
ఇవాళ ఉండవల్లి నివాసంలో టీడీపీ ఎంపీలతో భేటీ అయిన చంద్రబాబు, లోకేష్ వారికి వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో అనుకరించాల్సిన వైఖరిపై తగు సూచనలు చేశారు. అనంతరం చంద్రబాబు ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలను ప్రస్తావించారు. క్రిమినల్స్ రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందనేది జగన్ ప్రవర్తనతో అర్థమవుతోందన్నారు. జగన్ కారు కింద పడి తన భర్త చనిపోయాడని సింగయ్య భార్య ఫిర్యాదు చేస్తే... ఆ కేసులో నిందితుడిగా ఉన్న జగన్ సింగయ్య కుటుంబాన్ని పరామర్శ పేరుతో తన ఇంటికి పిలిపించుకుని 'లోకేష్ తనకు కోటి రూపాయలు ఇస్తానని ఆశచూపారు...అందుకే కేసు పెట్టాను' అని బెదిరించి మరీ ఆమెతో చెప్పించారన్నారు.

వివేకా హత్య సమయంలోనూ ఇదే తరహా డ్రామా ఆడారని చంద్రబాబు గుర్తుచేశారు. వివేకా చనిపోయారని తాను బాధపడితే తిరిగి తనపైనే ప్రత్యారోపణలు చేశారన్నారు. నారాసుర రక్త చరిత్ర అంటూ కథనాలు రాశారన్నారు. సీఎంగా ఉన్న తనపైనే హత్యారోపణలు చేసే ధైర్యం చేశారంటే ఎంత బరితెగించినవాళ్లో అర్థం చేసుకోవాలన్నారు. మన దురదృష్టం కొద్దీ అలాంటి వాళ్లతో రాజకీయం చేయాల్సి వస్తోందంటూ వాపోయారు. ఇలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని ఎంపీలుగా మీరూ అప్రమత్తంగా ఉండి ప్రజలను చైతన్యం చేయాలంటూ సూచించారు.

మరోవైపు పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు, ప్రాజెక్టుల సాధనకు కృషి చేయాలని సీఎం చంద్రబాబు ఎంపీలకు సూచించారు. పార్లమెంట్ సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలని, రైతులకు మద్ధతు ధర, నదీ జలాలు, పారిశ్రామికీకరణ వంటి అంశాలను పార్లమెంట్ లో లేవనెత్తాలని సూచించారు. ఆయా అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలను వివరించడంతో పాటు కేంద్రం నుంచి ఆశిస్తున్న సాయాన్ని పార్లమెంట్ ద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలన్నారు అలాగే మన ఎంపీల పనితీరు బాగుందని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications