రాజ్యసభ: టిడిపి అభ్యర్థులు గరికపాటి, సీతారామలక్ష్మి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి గరికపాటి మోహనరావు, పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మిలను ఎంపిక చేసింది. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సోమవారం రాత్రి ఆ విషయాన్ని ప్రకటించారు. వరంగల్ జిల్లాకు చెందిన గరికపాటి గతంలో మైనింగ్ కార్పొరేషన్‌కు చైర్మన్‌గా పని చేశారు. సుదీర్ఘ కాలంగా పార్టీలో అనేక రకాల బాధ్యతలు నిర్వహించారు. చంద్రబాబు నిర్వహించిన పాదయాత్రలో ఏడున్నర నెలలపాటు పూర్తిగా ఆయన వెంటే ఉండి అన్నీ తానై చూసుకొన్నారు.
సీతారామలక్ష్మి గతంలో భీమవరం మున్సిపల్ చైర్మన్‌గా పని చేశారు. గత ఎన్నికల్లో నర్సాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. తర్వాత ఆ జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించి పని చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో చిత్తశుద్ధితో పని చేసేవారికి గుర్తింపు ఉంటుందన్న సంకేతం పంపడం కోసం వీరిద్దరినీ ఎంపిక చేశామని, తమ పార్టీకి రాజ్యసభ సభ్యులు అచ్చిరారన్న అపప్రథ ఉందని చంద్రబాబు అన్నారు.

వీరిద్దరివీ పార్టీ కుటుంబాలు. 30 ఏళ్ల నుంచి పదవి ఉన్నా లేకపోయినా పార్టీ ఏ బాధ్యత ఇస్తే దానిని తీసుకొని పని చేస్తున్నారని, అలా పని చేస్తున్న కార్యకర్తలు, నాయకులకు పార్టీలో గుర్తింపు, గౌరవం, అవకాశాలు ఉంటాయన్న నమ్మకం కలిగించడానికే వీరిని ఎంపిక చేశామని ఆయన అన్నారు. కాపు సామాజిక వర్గం టిడిపి వైపు మొగ్గు చూపుతోందని, తమ పార్టీలో వారికి తగిన అవకాశాలు ఉంటాయన్న విశ్వాసం, నమ్మకం కలిగించడం కోసం సీతారామలక్ష్మిని ఎంపిక చేశామని చెప్పారు. బిసిలకు ఏ నష్టం లేకుండా కాపులను ఆదుకోవడానికి మేం కృషి చేస్తామని అన్నారు.
మహిళల విషయంలో మేం పట్టుదలతో ఉన్నాం. వారిని పైకి తెస్తామని మాటలు చెప్పడం కాకుండా చేతల్లో చూపాలన్న అభిప్రాయంతోనే సీతారామలక్ష్మిని ఎంపిక చేశామని చంద్రబాబు తెలిపారు. పార్టీలో ఇంకా అనేక మంది సమర్థులు ఉన్నారని, వారికి కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉందని, అయినా ప్రత్యేక పరిస్థితుల్లో వీరిని ఎంపిక చేశామని వివరించారు.












Click it and Unblock the Notifications