ఏపీ ప్రభుత్వ శుభవార్త.. వారి ఖాతాల్లో డబ్బులు పడ్డాయోచ్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేతన్నలకు మరో శుభవార్త చెప్పింది చంద్రబాబు సర్కార్. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత త్రిఫ్ట్ నిధులను తాజాగా విడుదల చేసింది. ఇక ఈ విషయాన్ని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత కార్మికులకు ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీల భాగంగా ఈ నిధులను విడుదల చేస్తున్నారు.
వారి ఖాతాల్లో డబ్బులు వేసిన ఏపీ సర్కార్
ఏపీ సీఎం చంద్రబాబు, లోకేష్ ఎన్నికలకు ముందు ప్రతి సంవత్సరం నేత కార్మికులకు ఐదు కోట్ల త్రిఫ్ట్ ఫండ్ నిధులను అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీకి కట్టుబడి కూటమి ప్రభుత్వం 2025 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడత నిధులను విడుదల చేసింది. మొత్తం 133 చేనేత సహకార సంఘాల బ్యాంకు ఖాతాలలో ఒక కోటి 67 లక్షల రూపాయలను జమ చేసింది.

5726 మంది చేనేత కార్మికులకు ప్రత్యక్షంగా లబ్ధి
ఈ నిధుల విడుదల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 5726 మంది చేనేత కార్మికులకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరుతుంది. ఇక ఇదే విషయాన్ని మంత్రి సవిత వెల్లడించి నేత కార్మికులకు శుభవార్త చెప్పారు. ఇక ఈ ఏడాది జనవరిలో ఆప్కో ద్వారా చేనేత వస్త్రాలను, నేత కార్మికుల నుండి కొనుగోలు చేసిన ప్రభుత్వం ఆప్కో ద్వారా వారికి చెల్లించవలసిన ఐదు కోట్ల రూపాయల బకాయిలను వారి ఖాతాలలో జమ చేసింది.
రెండు నెలల్లో వారికి తొమ్మిది కోట్ల రూపాయలకు పైగా నిధులు
సంక్రాంతికి ముందు నేత కార్మికులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గత డిసెంబర్ లో కూడా ఆప్కో నుండి దాదాపు రెండున్నర కోట్ల రూపాయల బకాయిలు చెల్లించింది. కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఏపీ ప్రభుత్వం తొమ్మిది కోట్ల రూపాయలకు పైగా నిధులను చేనేత కార్మికులకు అందించింది.
వారి కోసం ఏపీ సర్కార్ పని చేస్తుందన్న మంత్రి సవిత
చేనేత కార్మికులను ఆదుకోవడంతో పాటు, నేతన్నలకు గౌరవప్రదమైన జీవనంతో కూడిన ఉపాధిని కల్పించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం పనిచేస్తుందని, సీఎం చంద్రబాబు, నారా లోకేష్ నేత కార్మికులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నారని మంత్రి సవిత పేర్కొన్నారు. చేనేత వృత్తిని ప్రోత్సహించడం ద్వారా వారి జీవనోపాధిని మెరుగు పరుస్తున్నామని స్పష్టం చేశారు.
త్రిఫ్ట్ నిధులు విడుదల చేయడం పట్ల నేతన్నల సంతోషం
ఇదిలా ఉంటే చంద్రబాబు హామీ ఇచ్చిన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేనేత సహకార సంఘాలకు త్రిఫ్ట్ నిధులు విడుదల చేయడం పట్ల నేతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంత్రి సబితకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెబుతున్నారు ఈ నిధులు తమ ఆర్థిక భరోసా కు మరింత దోహదం చేస్తాయని వారు అంటున్నారు.












Click it and Unblock the Notifications