ప్లాన్ ప్రకారం.. హోదా డ్రామాను బాబు రక్తి కట్టించారు, సారీ చెప్పు: జగన్
హైదరాబాద్: ప్రత్యేక హోదా, ప్యాకేజీ డ్రామాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా బాగా రక్తి కట్టించారని, ఓ పథకం ప్రకారం హోదా అంశాన్ని నీరుగార్చుతున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం నాడు ఆరోపించారు.

చంద్రబాబు ఆనందిస్తున్నారు
ఆయన శాసన సభ రేపటికి (శుక్రవారం) వాయిదా పడిన అనంతరం మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. హోదా ఇస్తామన్న కేంద్రం దానిని కత్తిరిస్తుంటే చంద్రబాబు ఆనందిస్తున్నారని ఎద్దేవా చేశారు. హోదా డ్రామాను బాగా రక్తి కట్టించారన్నారు. నిజాయితీ, విశ్వసనీయత, విలువలు లేని వ్యక్తి చంద్రబాబు అని ధ్వజమెత్తారు.

బాబు క్షమాపణ చెప్పాలి
అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనను చంద్రబాబు రాత్రే స్వాగతించారని జగన్ గుర్తు చేశారు. దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, జైట్లీ వ్యాఖ్యలను స్వాగతించినందుకు ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రివర్గం నుంచి తన మంత్రులను ఉపసంహరింప చేసుకోవాలని డిమాండ్ చేశారు.

ఓటుకు నోటు కేసు నుంచి..
చంద్రబాబు తన స్వార్థం కోసం రాష్ట్రాన్ని అమ్మేశారని ధ్వజమెత్తారు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకే ఆయన ఐదు కోట్ల మంది ప్రజల మనోభావాలను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. చంద్రబాబు వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. తన మంత్రులను (సుజనా చౌదరి) జైట్లీ పక్కన కూర్చో బెట్టి మరీ ప్రకటన ఇప్పించారని మండిపడ్డారు.

రక్తం మురిగిందా?
గతంలో పార్లమెంటులో ప్రత్యేక హోదా పైన జైట్లీ ప్రకటన చూసి తన రక్తం మరిగిందని చంద్రబాబు చెప్పారని, మరి ఇప్పుడు ఎందుకు మరగడం లేదని ఎద్దేవా చేశారు. ఇప్పుడు చంద్రబాబు రక్తం మురిగిపోయిందా, కుళ్లిపోయిందా అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉండటం ఏపీ ప్రజలు చేసుకున్న ఖర్మ అన్నారు. బాబు ఇలాగే వ్యవహరిస్తే చరిత్రహీనుడిగా మిగిలిపోతారని హెచ్చరించారు. హోదా అంటే డబ్బుతో ముడిపెట్టి ఇచ్చిపుచ్చుకుంటే సరిపోతుందనుకుంటున్నారన్నారు.












Click it and Unblock the Notifications