చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల
అమరావతి: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు గురువారం రాత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. చంద్రబాబు ఛర్మ సంబంధిత అస్వస్థతపై జైలు అధికారులు ప్రకటన విడుదల చేశారు.
రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రి నుంచి వచ్చిన వైద్యులు చంద్రబాబుకు పరీక్షలు నిర్వహించారు. వైద్యులు పరీక్షలు చేసి మందులను సూచించారని, ఆ మందులను చంద్రబాబుకు అందిస్తామని డిప్యూటీ జైలు సూపరింటెండెంట్ రాజ్ కుమార్ వెల్లడించారు. వారి సూచనల మేరకు చంద్రబాబుకు వైద్య సహాయం అందిస్తామని జైలు అధికారులు తెలిపారు.

చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఎటువంటి భయాందోళన అపోహలకు గురికావద్దన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాజ్ కుమార్ మాట్లాడుతూ.. చంద్రబాబుకు ఛర్మ సంబంధిత సమస్య గురించి జైలు అధికారులకు తెలియజేశారన్నారు. జైల్లో వైద్యాధికారిణి పరీక్ష చేసి తమకు నివేదిక ఇచ్చారని తెలిపారు.
తమ అభ్యర్థన మేరకు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి ఇద్దరు ఛర్మ వ్యాధి నిపుణులు వచ్చి చంద్రబాబును పరీక్షించారని ఆయన చెప్పారు. చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని అన్నారు. గత వారం రోజులుగా ఎండ తీవ్రతగా ఎక్కువగా ఉండటంతో చంద్రబాబు ఒక్కసారిగా కొద్ది రోజుల క్రితం డీహైడ్రేషన్ కు గురైన విషయం తెలిసిందే. తాజాగా, ఛర్మ సంబంధిత అస్వస్థతకు గురి కావడం గమనార్హం.
చంద్రబాబు హెల్త్ బులిటెన్ వివరాలు:
బీపీ: 140/80
టెంపరేచర్: సాధారణం
పల్స్: 87
ఎస్పీఓ2: 97
హార్ట్: ఎస్1 ఎస్2
లంగ్స్: క్లియర్
ఫిజికల్ యాక్టివిటీ: గుడ్.
మరోవైపు, చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబసభ్యులు, టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మూడు రోజు ల క్రితమే డీహైడ్రేషన్ కు గురైనట్లు చెప్పినా.. ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోలేదని కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట్నుంచి చంద్రబాబును ఇబ్బంది పెట్టేలా ప్రభుత్వం చర్యలు ఉన్నాయని మండిపడ్డారు. చంద్రబాబు ఆరోగ్య సమస్యలపై కుటుంబసభ్యుల వినతిని కూడా అధికారులు పట్టించుకోలేదన్నారు. జైల్లో వసతులు కల్పించకుండా శారీరకంగా చంద్రబాబును ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications