ఏపీలో పిడుగులు పడే చోట సైరన్ల మోత..! చంద్రబాబు కీలక నిర్ణయం..!
ఏపీలో రియల్ టైమ్ గవర్నెన్స్ పై సీఎం చంద్రబాబు ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే అధికారులకు పలు సూచనలు కూడా చేశారు. సాంకేతికత వినియోగంతో రాష్ట్రంలో శాంతిభద్రతల పర్యవేక్షణతో పాటు ప్రభుత్వ రికార్డుల నిర్వహణ, విపత్తుల వేళ తీసుకోవాల్సిన నిర్ణయాలు, నేరాల కట్టడి వంటి అంశాలపై సీఎం చంద్రబాబు అధికారులతో చర్చించారు.
టెక్నాలజీ వాడకంతో రాష్ట్రాన్ని జీరో క్రైమ్ రేట్ స్టేట్ గా మార్చాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సాంకేతికత వినియోగతంతో శాంతి భద్రతల పర్యవేక్షణలో ఏపీని ఓ మోడల్ రాష్ట్రంగా మార్చాలన్నారు. సీసీ కెమెరాలతో క్రైమ్ హాట్ స్పాట్లపై నిరంతరం నిఘా పెట్టి నేరాల నియంత్రణ చేయాలని ఆదేశించారు. దీంతో పాటు ప్రైవేటు సీసీ కెమెరాల ఫుటేజి
తీసుకునే విషయంలోనూ నిబంధనల్ని మార్చాలని ఆదేశాలు ఇచ్చారు.

నేరాల నియంత్రణకు ప్రైవేటు కెమెరాలను కూడా వాడుకునేలా చూడాలని అధికారులకు చంద్రబాబు స్పష్టం చేశారు. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడే వారి విషయంలో టెక్నాలజీని మరింతగా వాడుకోవాలన్నారు. కొందరు తెలివిగా నేరాలు చేసి, దాన్ని ప్రభుత్వంపై నెడుతున్నారని, పోలీసులకు సహకరించని వ్యక్తులు, నేతల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇలాంటి వారి కోసం పబ్లిక్ సేఫ్టీ యాక్టు కింద వారి వద్ద నుంచి డేటా తీసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. వారిని ఆయా నేరాలకు బాధ్యులుగా చేసే అంశంపైనా దృష్టి పెట్టాలన్నారు.
వివిధ రంగాల్లో డ్రోన్లు, సీసీ కెమెరాల వినియోగం పెంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఓర్వకల్లులో డ్రోన్ సిటీ పురోగతిపైనా అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. అలాగే వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన రికార్డులు, డేటా భద్రతకు బ్లాక్ చెయిన్ టెక్నాలజీని వాడాలన్నారు. ప్రస్తుతం రెవెన్యూ రికార్డులను కూడా పూర్తి స్థాయి ప్రక్షాళన చేసి నూతన సాంకేతికతనే వినియోగించి భద్రంగా ఉండేలా చూడాలన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమాచారం డేటా లేక్ ద్వారా సమన్వయం చేయాలని సీఎం సూచించారు.

మరోవైపు పిడుగులు పడే ప్రాంతాల్లో విలువైన ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా పనిచేయాలని, ముందస్తు హెచ్చరికల వ్యవస్థ సమర్ధంగా పనిచేసేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ముందుగానే ఆయా ప్రాంతాల్లో సైరన్ మోగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. భూగర్భ జలాల పర్యవేక్షణకు ఫీజియో మీటర్లు, సెన్సార్లు త్వరితగతిన పునరుద్ధరించాలన్నారు. రిజర్వాయర్లలో నీరు, సముద్రంలోకి వదిలే నీటిపై వివరాలు కచ్చితంగా ఉండాలన్నారు. వీటిని రియల్ టైమ్ లో పర్యవేక్షిస్తే వరదల్ని నియంత్రించవచ్చన్నారు.












Click it and Unblock the Notifications