తీవ్ర ఆవేదనతో ఏపీ సీఎస్ కు చంద్రబాబు లేఖ
టిడిపి అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి లేఖ రాశారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆయన తన లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నారని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు.
పిడుగుపాటుతో మరణించిన రైతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని కోరారు. పిడుగులు పడి ఏడుగురు రైతులు దుర్మరణం పాలయ్యారని, రైతుల మరణం బాధాకరమని పేర్కొన్న చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మార్చిలో కురిసిన వర్షాల కారణంగా రెండు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని పేర్కొన్న చంద్రబాబు గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతోనూ చేతికొచ్చే పంట నేల పాలైందని లేఖ ద్వారా వెల్లడించారు.

రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, కృష్ణా, గుంటూరు, గోదావరి డెల్టా ప్రాంతాలలో భారీగా వరి పంట దెబ్బతిందని ఆయన లేఖలో వెల్లడించారు. అకాల వర్షాల ప్రభావంతో కల్లాలలో ఆరబెట్టిన వేలాది టన్నుల ధాన్యం తడిసి పోయిందని, మొక్కజొన్న రైతులు కూడా తీవ్ర స్థాయిలో నష్టపోయారని వెల్లడించారు. వర్షం కారణంగా తడిసి రంగు మారిన ధాన్యాన్ని మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని చంద్రబాబు పేర్కొన్నారు.
రబీ ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని లేఖలో వెల్లడించిన చంద్రబాబు రైతుల సమస్యలను కళ్లకు కట్టారు. గుంటూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాలలో భారీగా మిరప పంట దెబ్బతిందని పేర్కొన్న ఆయన ఈదురుగాలుల దాటికి మిరపకాయలు రాలిపోయాయన్నారు. మామిడి రైతులు, అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారని లేఖలో వెల్లడించారు. వరి, మొక్కజొన్న పంటలకు ఎకరాకు 20 వేలు, మిర్చి, అరటి, మామిడికి ఎకరానికి 50 వేల చొప్పున పరిహారం అందించాలని చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications