ఏపీ కొత్త సీఎస్, ఇంటెలిజెన్స్ ఛీఫ్ వీరేనా ? చంద్రబాబు కీలక నిర్ణయం..!
ఏపీలో కొత్తగా కొలువుదీరబోతున్న కూటమి ప్రభుత్వంలో కీలక అధికారుల నియామకాలపై కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న అధికారులను సాగనంపడటంతో పాటు కొత్త వారిగా ఎవరికి అవకాశం కల్పించాలనే దానిపై చర్చిస్తున్నారు. ఇప్పటికే గత ఐదేళ్ల ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలనూ వైసీపీ భ్రష్టుపట్టించిందని భావిస్తున్న చంద్రబాబు వాటిని తిరిగి గాడిన పెట్టేందుకు సమర్ధులైన అధికారులు అవసరం ఉందని చెప్తున్నారు.
ఏపీలో కీలకమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్న జవహర్ రెడ్డిని తాము తప్పించకుండానే ఆయనే స్వయంగా వెళ్లిపోయేలా ఇప్పటికే చంద్రబాబు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన స్ధానంలో మరో సీనియర్ ఐఏఎస్ అధికారి, ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న విజయానంద్ ను తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వివిధ శాఖల్లో పనిచేసిన అనుభవంతో పాటు విధేయత కూడా ఆయనకు కలిసి వస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుత ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి పదవీకాలం జూన్ నెలాఖరుకు ముగుస్తున్న నేపథ్యంలో కొత్త సీఎస్ గా విజయానంద్ నియమించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1992 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి కె.విజయానంద్ గత ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శి పదవిని కొన్ని రోజులు పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించారు. బీసీ (యాదవ) సామాజిక వర్గానికి చెందిన విజయానంద్ ఉమ్మడి రాష్ట్రంలో నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలో కలెక్టర్ గా, ఏపీ ట్రాన్స్ కో , ఏపీ జెన్ కో సీఎండీగా పనిచేశారు.రాష్ట్ర విభజన తదుపరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎనర్జీ, ఐటి మంత్రిత్వ శాఖల ముఖ్యకార్యదర్శి(ప్రిన్సిపల్ సెక్రెటరీ)గా పనిచేయడంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవోగా బాధ్యతలు నిర్వహించారు.
అలాగే మరో కీలకమైన పోస్టు ఇంటెలిజెన్స్ ఛీఫ్ కు కూడా చంద్రబాబు మరో సీనియర్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రమణ్యం పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రైల్వేస్ డీజీపీగా ఉంటూ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిన బాల సుబ్రమణ్యాన్ని పిలిపించి ఇంటెల్ ఛీఫ్ పదవి కట్టబెట్టవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే ఇంటెల్ ఛీఫ్ గా ఉంటూ వైసీపీకి అనుకూలంగా పనిచేసిన పీఎస్సార్ ఆంజనేయుల్ని ఈసీ తప్పించింది. ఆయన ఇవాళ చంద్రబాబును కలిసేందుకు వచ్చినా అపాయింట్ మెంట్ ఇవ్వలేదు.












Click it and Unblock the Notifications