ఎల్లుండి తిరుపతికి చంద్రబాబు: అమరావతి రైతు పాదయాత్ర ముగింపు సభకు చీఫ్ గెస్ట్‌గా
తిరుపతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన పాదయాత్ర ముగిసింది. అమరావతిని మాత్రమే రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు ఈ పాదయాత్రను చేపట్టారు. న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో సుమారు 45 రోజుల పాటు సాగింది. సోమవారం తిరుపతిలో ముగిసింది. ఇక ముగింపు సభను నిర్వహించడానికి వారు సమాయాత్తమౌతున్నారు. ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శుక్రవారం ఈ సభ జరుగనుంది.

ఏపీ హైకోర్టు అనుమతి..
తిరుపతిలో నిర్వహించ తలపెట్టిన ఈ భారీ బహిరంగ సభకు న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. దీన్ని నిర్వహించుకోవడానికి ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. కొద్దిసేపటి కిందటే తన తుది నిర్ణయాన్ని ప్రకటించింది. తిరుపతిలో అమరావతి పరిరక్షణ సమితి నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు అనుమతి ఇవ్వడంపై వాదనలు ముగిశాయి. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, పిటిషనర్ల వైపు నుంచి ప్రముఖ న్యాయవాది లక్ష్మీనారాయణ తమ వాదనలను వినిపించారు.

భారీగా సమీకరణ..
ఈ సభను విజయవంతం చేయడం ద్వారా- రాష్ట్ర రాజధానిగా అమరావతి మాత్రమే కొనసాగింపజేయాలనే తమ ఆకాంక్షను ప్రభుత్వానికి బలంగా తెలియజేయాలనేది పరిరక్షణ సమితి ప్రతినిధుల ప్రధాన ఉద్దేశం. ఈ సభ.. అటు రాజకీయంగానూ ప్రాధాన్యతను సంతరించుకుంది. దీన్ని విజయవంతం చేయడానికి వైసీపీయేతర పార్టీలన్నీ ఏకం అయ్యాయి. ప్రతిపక్ష తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, దాని మిత్రపక్షం జనసేన, సీపీఐ, సీపీఎం ఇప్పటికే తమ మద్దతును ప్రకటించాయి.

ముగింపు సభకు హేమాహేమీలు..
ఆయా పార్టీల నాయకులందరూ దశలవారీగా పాదయాత్రలో పాల్గొన్నారు. అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులకు తమ సంఘీభావాన్ని తెలిపారు. వారికి నైతిక మద్దతును ప్రకటించారు. ఆయా పార్టీల నేతలందరూ ముగింపు సభకూ హాజరు కానుండటం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ సభకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. తొలుత- పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ పాల్గొంటారనే ప్రచారం సాగింది. తాజాగా- స్వయంగా చంద్రబాబే రంగంలోకి దిగుతారని అంటున్నారు.

తిరుపతికి రెండోసారి..
చంద్రబాబు నాయుడు తిరుపతికి రావడం ఈ మధ్యకాలంలో ఇది రెండోసారి అవుతుంది. ఇదివరకు లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ అభ్యర్థిని, కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మి గెలుపు కోసం విస్తృతంగా పర్యటించారు. లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ప్రచార సభలో పాల్గొన్నారు. ఆ తరువాత మళ్లీ ఆయన తిరుపతికి రావడం ఇదే మొదటి సారి అవుతుంది. ముఖ్యఅతిథిగా చంద్రబాబు పాల్గొంటారని అంటున్నారు.

చంద్రబాబు దిశానిర్దేశంలో..
మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతి పరిరక్షణ సమితి చేపట్టిన నిరసన ప్రదర్శనలు, ఆందోళనల కార్యక్రమాలకు మొదటి నుంచీ చంద్రబాబే దిశానిర్దేశం చేస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. రైతులకు ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆయన జోలె కూడా పట్టారు. ఆయన భార్య నారా భువనేశ్వరి.. రెండు ప్లాటినం గాజులను విరాళంగా ఇచ్చారు. నారా లోకేష్ సహా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు, క్యాడర్ మొత్తం మూడు రాజధానులను వ్యతిరేకంగా ఉంటోంది.

ఇంకా ఎవరెవరు?
అమరావతి పరిరక్షణ సమితి పాదయాత్రకు మద్దతు ప్రకటించిన బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ, సీపీఎం నేత నారాయణ ఈ సభలో పాల్గొనే అవకాశం ఉంది. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సైతం దీనికి హాజరవుతారని చెబుతున్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రైతు సంఘాల నాయకులు, ప్రతినిధులు హాజరవుతారనే ప్రచారం సాగుతోంది. భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ తికాయిత్, యధువీర్ సింగ్ హాజరయ్యే అవకాశం ఉందని ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ఇటీవలే తెలిపారు.












Click it and Unblock the Notifications