తారకరత్న మృతిపై చంద్రబాబు, జగన్, కేసీఆర్ సంతాపం: ‘బావ’ లేరంటూ లోకేష్ భావోద్వేగం
బెంగళూరు: ప్రముఖ సినీనటుడు నందమూరి తారకరత్న(39) మరణం నందమూరి, నారా కుటుంబాల్లోనే గాక, తెలుగు రాష్ట్రాల్లోనూ విషాదం నింపింది. శనివారం రాత్రి 9.30గంటల సమయంలో ఆయన తుది శ్వాస విడిచారు. గత 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.తారకరత్న మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

తారకరత్న: ‘బావ' అనే గొంతుక లేదంటూ నారా లోకేష్ భావోద్వేగం
తారకరత్న మృతిపై టీడీపీ నేత నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'బావ అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక నాకు వినిపించదు. నేనున్నానంటూ నా వెంట నడిచిన ఆ అడుగులు చప్పుడు ఆగిపోయింది. నందమూరి తారకరత్న మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగుదేశం యువతేజం తారకరత్న మృతి మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. నిష్కల్మషమైన నీ ప్రేమ, స్నేహ బంధం మన బంధుత్వం కంటే గొప్పది. తారకరత్నకి కన్నీటి నివాళులతో..' అంటూ తారకరత్నతో ఉన్న ఫొటోను ట్వీట్ చేస్తూ నారా లోకేష్ వ్యాఖ్యానించారు.

విషాదం నింపారంటూ తారకరత్న మృతిపై చంద్రబాబు
తారకరత్న మరణంపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'నందమూరి తారకరత్న మరణ వార్త తీవ్రమైన దిగ్భ్రాంతిని, బాధను కలిగించింది. తారకరత్నను బ్రతికించుకునేందుకు చేసిన ప్రయత్నాలు, కుటుంబ సభ్యుల, అభిమానుల ప్రార్థనలు, అత్యంత నిపుణులైన డాక్టర్ల వైద్యం ఫలితాన్ని ఇవ్వలేదు. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న... చివరికి మాకు దూరం అయ్యి మా కుటుంబానికి విషాదం మిగిల్చాడు. తారకరత్న ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను' అని చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

తీరని లోటంటూ తారకత్న మరణంపై రేవంత్ రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. తారకరత్న మృతికి సంతాపం తెలియజేశారు. 'తారకరత్న మరణ వార్త నన్ను చాలా కలచివేసింది. ఆయన మృతి పట్ల నా ప్రగాఢ సంతాపం' అని తెలిపారు రేవంత్ రెడ్డి. చిన్న వయసులోనే సినీ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న తారకరత్న మరణం సినీ రంగానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా. తారకరత్న కుటుంబానికి నా ప్రగడా సానుభూతి తెలియజేస్తున్నా అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ఎల్లుండి మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు
గత 23 రోజులుగా నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న శనివారం రాత్రి కన్నుమూశారు. తారక రత్న పార్థీవదేహాన్ని ఉదయం ఉదయానికి మోకిలలోని ఆయన నివాసానికి తరలించనున్నారు.ఎల్లుండి (సోమవారం) ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తెలుగు ఫిలిం ఛాంబర్‌లో ప్రజల సందర్శనార్థం ఆయన పార్థీవదేహాన్ని ఉంచనున్నారు. సోమవారం సాయంత్రం ఐదు గంటలకి మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
కాగా, బెంగళూరు ఆస్పత్రి వద్ద భారీగా అభిమానులు చేరుకున్నారు. తమకు చూపించకుండా పార్థీవదేహాన్ని హైదరాబాద్ తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తారకరత్న మృతిపై సీఎం వైఎస్ జగన్ సంతాపం
తారకరత్న మృతిపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తారకరత్నం మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగిరావాలని కోరుకున్నాం. కాని విధి మరోలా తలచింది. నందమూరి తారకరత్న అకాల మరణం అత్యంత బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ప్రార్థిస్తున్నాను. అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి' అని విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

తారకరత్న మృతి పట్ల కేసీఆర్ ప్రగాఢ సానుభూతి
తారకరత్న మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తారకరత్న మృతి పట్ల మంత్రి హరీశ్ రావు సంతాపం తెలిపారు. ఆయన మరణం సినీ రంగానికి తీరని లోటని అన్నారు. తారకరత్న కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నందమూరి తారకరత్న మృతి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంతాపం తెలిపారు. విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకున్న ఆయన చిన్న వయసులోనే మృతి చెందడం దురదృష్టకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. తారకరత్న కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అని పేర్కొన్నారు.'సినీనటుడు, టీడీపీ నాయకుడు నందమూరి తారకరత్న మరణం బాధాకరం. తారకరత్న ఆత్మకు శాంతి కలిగించాలని భగవంతుడుని ప్రార్థిస్తున్నా. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా' బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications