IndiGo: ఇండిగో, రామ్మోహన్..! తప్పెవరిదో తేల్చేసిన చంద్రబాబు..!
ఇండిగో ఎయిర్ లైన్స్ లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా గత కొన్ని రోజులుగా వేలాది విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఈ సమస్యను పరిష్కరించడంలో ఇండిగో వైఫల్యం స్పష్టంగా కనిపించింది. దీంతో పాటు చర్యలు తీసుకోవడంలో కేంద్రం కూడా విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తాయి. అందునే టీడీపీకి చెందిన పౌర విమానయానశాఖమంత్రి రామ్మోహన్ నాయుడు పాత్రపైనా సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఇవాళ తొలిసారి స్పందించారు.
ఇండిగోలో తలెత్తిన సంక్షోభంపై ఇవాళ మీడియాతో మాట్లాడిన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటెషన్ నిబంధనలు అమలు చేశారని చంద్రబాబు తెలిపారు. విమాన ప్రయాణికుల భద్రత పెంచటంలో భాగంగా పైలట్లు, క్రూ సభ్యులకు విశ్రాంతి సమయం ఇచ్చేలా కేంద్రం నిబంధనలు పెట్టిందన్నారు.ఇండిగో సంస్థ సరిగా వ్యవహరించలేకపోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారని చంద్రబాబు వెల్లడించారు.

జరిగిన పరిణామాలపై కేంద్రం చర్యలు తీసుకుంటోందని, పరిస్థితిని చక్కదిద్దుతోందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. మరోవైపు ఇవాళ కూడా వందల సంఖ్యలో ఇండిగో విమానాలు రద్దయ్యాయి. 10వ తేదీ కల్లా పరిస్ధితి అదుపులోకి వస్తుందని ఇండిగో చెప్తున్నా విమర్శల జడివాన మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఎయిర్ పోర్టుల్లో నరకం కనిపిస్తోంది. దీనిపై ఇవాళ పార్లమెంట్ లో మాట్లాడిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు .. సమస్యను వేగంగా పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. అయినా విపక్షాలు మాత్రం ఆయన రాజీనామాకు పట్టుబడుతున్నాయి.












Click it and Unblock the Notifications