ఇప్పటికీ కాంగ్రెట్స్ చెప్పుకోని కెసిఆర్, బాబు: ఇకనైనా..
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కాబోయే ముఖ్యమంత్రులు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నివాసాల వద్ద ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి సందడి నెలకొంది. సినీ, రాజకీయ ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు వారి ఇంటికెళ్లి మరీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీంతో ఎప్పుడూ వారి నివాసాలు సందడిగానే ఉంటున్నాయి.
అయితే ఈ రెండు రాష్ట్రాలకు కాబోయే ముఖ్యమంత్రులు చంద్రశేఖర్ రావు, చంద్రబాబు నాయుడు మాత్రం ఒకరినొకరు కలుసుకుని శుభాకాంక్షలు తెలుపుకోకపోవడం గమనార్హం. ఎన్నికల ఫలితాల తర్వాత మీడియా సమావేశాల్లో మాత్రమే ఇరువురు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వారిద్దరి మధ్య సత్సంబంధాలు లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
జూన్ 2న ఏర్పడబోయే రెండు కొత్త రాష్ట్రాలకు తొలి ముఖ్యమంత్రులు అవుతున్న చంద్రబాబు నాయుడు, చంద్రశేఖర్ రావు ఒకరికొకరు ప్రత్యక్షంగా శుభాకాంక్షలు చెప్పుకోలేదు. కనీసం ఫోన్ ద్వారా కూడా వీరిద్దరు శుభాకాంక్షలు తెలుపుకోలేదు. ప్రమాణ స్వీకారం చేసుకునే సందర్భంలోనైనా వీరిద్దరు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారో లేదో వేచిచూడాలి.

ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలున్నప్పటికీ ప్రస్తుతం రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోతున్న సమయంలో తలెత్తనున్న పలు సమస్యలకు పరిష్కారం లభించాలంటే ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. ఉద్యోగుల విభజన, పంపిణీ లాంటి సమస్యలపై ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి తప్పక ఏర్పడుతుంది.
గతంలో చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో కొనసాగిన కె చంద్రశేఖర్ రావు.. విభేదాలు రావడంతో ఆయన 2001లో టిఆర్ఎస్ పార్టీని స్థాపించారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఉద్యమాన్ని కొనసాగించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు, కెసిఆర్‌లు పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు.
కాగా, ఇప్పుడు ఉద్యోగుల పంపిణీపై ఈ ఇద్దరు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో సీమాంధ్ర ఉద్యోగులు ఉండటానికి వీళ్లేదని కెసిఆర్ చెబుతుండగా.. సీమాంధ్ర ఉద్యోగులకు అండగా ఉంటామని, ప్రస్తుతం జరుగుతున్న ఉద్యోగుల విభజన తాత్కాలికమేనని చెబుతున్నారు. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications