రాజధాని అంటే..: పవన్‌పై బాబు, జనసేన చెప్పలేదా!
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంత పర్యటన పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం స్పందించారు. రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్న పవన్ వ్యాఖ్యల గురించి తనకు తెలియదని చెప్పారు. రాజకీయ పార్టీలకు దూరదృష్టి ఉండాలన్నారు.
ప్రల భవిష్యత్తు కోసమే రాజధాని నిర్మాణమని చెప్పారు. రాజధానిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. రాజధాని ప్రాంత రైతులకు మేలు జరుగుతుందని హామీ ఇచ్చారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. రాజధాని కోసం రైతులు స్వచ్చంధంగా భూములు ఇచ్చారని చెప్పారు.
రాజధాని అంటే కార్యాలయాలు కట్టడమే కాదన్నారు. ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసమే అత్యద్భుత రాజధాని నిర్మాణం కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కాగా, రైతుల మనోభావాలను చంద్రబాబుకు వివరిస్తానని పవన్ కళ్యాణ్ తన రాజధాని ప్రాంత పర్యటన సమయంలో చెప్పిన విషయం తెలిసిందే.

పర్యటన వివరాలు ఇవ్వలేదా?
పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంత పర్యటనలో అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున ఆయనను చూసేందుకు తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో తొక్కిసలాట జరిగింది. ఈ సందర్భంగా ఏపీ సీఎం కార్యాలయం భద్రత పైన వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
పవన్ వస్తున్నారని తెలిసినా భద్రత ఎందుకు కల్పించలేదని సీఎంవో అధికారులను ప్రశ్నించింది. దీనిపై తక్షణమే వివరణ ఇవ్వాలని ఆదేశించింది. స్పందించిన పోలీసు శాఖ.. పవన్ పర్యటన గురించి సమాచారం ఉందని, అయితే పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు జనసేన అందచేయలేదని చెప్పారు. వివరాలు అడిగినా ఇవ్వలేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications