లండన్ నుంచి చంద్రబాబు బిగ్ న్యూస్..! ఏపీకి 20 వేల కోట్లు..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లండన్ పర్యటన కొనసాగుతోంది. భార్య భువనేశ్వరికి లభించిన రెండు అవార్డుల్ని స్వీకరించేందుకు తీసుకుని వెళ్లిన చంద్రబాబు.. అక్కడ కూడా రాష్ట్రానికి పెట్టుబడుల వేట కొనసాగిస్తున్నారు. వ్యక్తిగత టూర్ అని చెప్పినప్పటికీ రాష్ట్రం కోసం పెట్టుబడుల వేట మాత్రం కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా పలువురు స్దానిక పారిశ్రామిక వేత్తలతో చంద్రబాబు వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.
ఏపీకి పెట్టుబడులు ఆహ్వానించేందుకు లండన్ పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా లండన్ లో ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ క్రిస్ ఫిట్జార్ల్డ్ తో చంద్రబాబు భేటీ అయ్యారు. లండన్ లో అతిపెద్ద విద్యుత్ సరఫరాదారు సంస్థగా ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ కు పేరుంది. పునరుత్పాదక విద్యుత్ రంగంలో ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆక్టోపస్ ఎనర్జీని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు.

అలాగే అమరావతి, విశాఖలలో నూతన టెక్నాలజీ ద్వారా విద్యుత్ సరఫరా నియంత్రణ రంగంలో పనిచేసేందుకు అవకాశాలు ఉన్నాయని సీఎం వారికి వివరించారు. క్లీన్ ఎనర్జీ, స్మార్ట్ గ్రిడ్, డేటా అనలిటిక్స్ రంగాల్లో ఏపీలో పని చేసేందుకు అవకాశాలు ఉన్నాయని ఆక్టోపస్ ఎనర్జీ ప్రతినిధులకు స్పష్టం చేశారు. 160 గిగావాట్లు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసేలా ఏపీ లక్ష్యం పెట్టుకుందని తెలిపారు. విద్యుత్ రంగంలో ప్రభుత్వ పాలసీలు వివరించిన ముఖ్యమంత్రి...ఈ రంగంలో ఏపీ నిర్దేశించుకున్న మన లక్ష్యాలను వివరించారు. అనంతరం రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.
అనంతరం హిందుజా గ్రూప్ భారత చైర్మన్ అశోక్ హిందుజా, యూరప్ లోని హిందుజా గ్రూప్ చైర్మన్ ప్రకాశ్ హిందుజా, హిందుజా రెన్యువబుల్స్ ఫౌండర్ శోమ్ హిందుజాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీలో ఉన్న పెట్టుబడుల అవకాశాలను వారికి వివరించారు. దీంతో హిందూజా గ్రూప్ తో ఏపీ ప్రభుత్వ ఒప్పందం చేసుకుంది. దశలవారీగా ఏపీలో రూ.20 వేల కోట్ల పెట్టుబడి పెట్టాలని హిందూజా గ్రూప్ నిర్ణయించింది.

విశాఖలో ఉన్న హిందుజా పవర్ ప్లాంట్ సామర్ధ్యాన్ని మరో 1,600 మెగావాట్ల ఉత్పత్తి పెంచేందుకు ఒప్పందం జరిగింది. రాయలసీమలో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి యూనిట్ లను ఏర్పాటు చేసే అంశంపై ఒప్పందం చేసుకున్నారు. కృష్ణా జిల్లా మల్లవల్లిలో ఎలక్ట్రిక్ బస్సులు, తేలికపాటి వాహనాల తయారీ ప్లాంట్ ఏర్పాటు, రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ల నెట్వర్క్ ఏర్పాటు అంశంపై ఒప్పందం చేసుకున్నారు. ఏపీలో గ్రీన్ ట్రాన్స్ పోర్ట్ ఎకో సిస్టంను అభివృద్ధి చేసేలా హిందూజా గ్రూప్ సహకరించనుంది.












Click it and Unblock the Notifications