చంద్రబాబుకు ఓట్లు.. పవన్ కళ్యాణ్ కు కరెన్సీ నోట్లు కావాలి: ఎంపీ మార్గాని భరత్!!
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ తెలుగుదేశం పార్టీపై, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. టిడిపి పల్లకి మోయడమే పవన్ కళ్యాణ్ పనిగా పెట్టుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ పెట్టింది తెలుగుదేశం పార్టీ కోసమేనని, ప్రజల కోసం కాదని ఎంపీ మార్గాని భరత్ వ్యాఖ్యానించారు.
రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఎంపీ మార్గాన్ని భరత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు సొంత కొడుకు సామర్థ్యంపై నమ్మకం లేక సినీ గ్లామర్ ను నమ్ముకున్నారు అని, సినీ గ్లామర్ తో రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని ఎంపీ మార్గాని భరత్ విమర్శించారు.

చంద్రబాబుకు ఓట్లు కావాలని, పవన్ కళ్యాణ్ కు నోట్లు కావాలని మార్గాని భరత్ ఎద్దేవా చేశారు. గత 15 సంవత్సరాల నుండి ముసుగేసుకుని జనసేన పార్టీ రాజకీయాలు చేసిందని, చివరకు చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో బుక్అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలు పాలు కావడంతో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ రథసారధి పాత్ర పోషిస్తున్నారని మార్గాని భరత్ మండిపడ్డారు.
పవన్ తన ముసుగును తొలగించి పొత్తు పేరుతో మరో రాజకీయ కుప్పిగంతులుకు సిద్ధపడుతున్నారు అని మార్గాని భరత్ ఆరోపించారు.
చంద్రబాబు నక్కజిత్తుల రాజకీయాలను ప్రజలు అర్థం చేసుకున్నారని, అందుకే చంద్రబాబు ఇన్ని రోజులుగా జైలులో ఉంటున్న ప్రజల నుంచి ఎటువంటి స్పందన లేదని, ప్రజలు సానుభూతి చూపించడం లేదని అన్నారు మార్గాని భరత్.
టిడిపి, జనసేన రాజమండ్రిలో భేటీ అయినంత మాత్రాన ఫలితమేమి ఉండదని పేర్కొన్నారు. దేవీ నవరాత్రులకు ప్రజలు భక్తిశ్రద్ధలతో తరలి వస్తున్నారని, 45 సంవత్సరాల రాజకీయ చరిత్ర అని బిల్డప్ ఇచ్చే చంద్రబాబు అరెస్ట్ అయితే ఎందుకు స్పందించడం లేదో ఇప్పటికైనా గ్రహించాలన్నారు మార్గాని భరత్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు రాజకీయ కార్యచరణ లేదని ఆయన ఎప్పుడు ఏం చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు.
కౌలు రైతులు పది, పదిహేను మందికి డబ్బులు ఇచ్చేస్తే సరిపోతుందా అంటూ ప్రశ్నించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అభివృద్ధి, సంక్షేమ పాలన అందిస్తున్న జగన్ ను రాష్ట్ర ప్రజలు సంపూర్ణంగా విశ్వసించారని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు ప్రజలు నూటికి నూరు మార్కులు వేస్తున్నారని ఎంపీ మార్గాని భరత్ అభిప్రాయం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications