పవన్ తో భేటీ ఎఫెక్ట్ మొదలు-చంద్రబాబు పల్నాడు టూర్ లో జనసేన జెండాలు-జూ.ఎన్టీఆర్ సరేసరి..
తాజాగా విజయవాడలో చంద్రబాబు-పవన్ కళ్యాణ్ భేటీ ఏపీలో రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. వీరిద్దరి భేటీతో పవన్ కు మిత్రపక్షంగా ఉన్న బీజేపీ వివరణలు ఇచ్చుకుంటుండగా.. ఇప్పుడు పల్నాడులో టీడీపీ అధినేత పర్యటనలోనూ ఈ ప్రభావం కనిపించింది. చాలాకాలం తర్వాత చంద్రబాబు టూర్ లో జనసేన జెండాలు దర్శనమిచ్చాయి. దీంతో రాబోయే రోజుల్లో ఏం జరగబోతోందో అర్ధమవుతోంది.

చంద్రబాబు-పవన్ భేటీ ప్రకంపనలు
విశాఖ ఘటనల నేపథ్యంలో విజయవాడలో చంద్రబాబు-పవన్ కళ్యాణ్ భేటీ కావడం ఇరుపార్టీల్లోనూ సంతోషం నింపుతోంది. అదే సమయంలో పవన్ పార్టీ జనసేనకు మిత్రపక్షంగా ఉన్న బీజేపీలో కలవరం పుట్టిస్తోంది. చంద్రబాబు-పవన్ కళ్యాణ్ మరోసారి పొత్తు పెట్టుకుంటే వీరితో రాబోయే రోజుల్లో ఏయే పార్టీలు కలిసి వస్తాయన్న దానిపై కూడా చర్చ జరుగుతోంది. అన్నింటికంటే మించి వీరిద్దరి భేటీపై అధికార వైసీపీ నిప్పులు చెరుగుతోంది. ఇలా ఎటు చూసినా వీరిద్దరి భేటీ ప్రభావం రాష్ట్ర రాజకీయాలపై పడుతోంది.

చంద్రబాబు పల్నాడు టూర్ లో
పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు తాజా భేటీ ప్రభావం తాజాగా నిన్న పల్నాడులో ఆయన నిర్వహించిన టూర్ లోనూ కనిపించింది. ఇన్నాళ్లూ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు కలిసి పనిచేద్దామని చంద్రబాబు ప్రతిపాదిస్తున్నా ముందుకు రాని జనసేనాని పవన్ కళ్యాణ్.. ఇప్పుడు తాజా భేటీ తర్వాత ఫుల్ క్లారిటీతో ఉన్నట్లు కనిపిస్తోంది. దీని ప్రభావం క్షేత్రస్దాయిలోనూ కనిపిస్తోంది. ఈ విషయం చంద్రబాబు పల్నాడు టూర్ లో స్పష్టంగా కనిపించింది. చంద్రబాబు టూర్ లో ఎప్పుడూ కనిపించే పసుపు జెండాలకు తోడు జనసేన, పవన్ జెండాలు కూడా కనిపించడం చర్చనీయాంశమవుతోంది.
చంద్రబాబు టూర్ లో జనసేన జెండాలు
చంద్రబాబు పల్నాడు టూర్ లో చాలా కాలం తర్వాత టీడీపీతో కలిపి జనసేన జెండాలు కూడా కనిపించాయి. స్ధానిక జనసేన నేతలు పల్నాడులో చంద్రబాబు పర్యటిస్తున్న సమయంలో తాము కూడా శృతి కలిపారు. జెండాలతో తరలివచ్చి దర్శనమిచ్చారు. వాస్తవానికి చంద్రబాబు తన టూర్ కు జనసేన నేతల్ని కానీ, కార్యకర్తల్నికానీ ఆహ్వానించలేదు. అలాగే టీడీపీ స్ధానిక నేతలు కూడా వారిని ఆహ్వనించలేదు. అయినా జనసేన కార్యకర్తలు చంద్రబాబును జెండాలతో తరలివచ్చి ఓన్ చేసుకునేందుకు ప్రయత్నించడం చర్చనీయాంశమవుతోంది.
చంద్రబాబుకు మద్దతుగా పవన్, ఎన్టీఆర్ జెండాలు !
అంతే కాదు చంద్రబాబు పల్నాడు టూర్ లో మరో విశేషం కూడా కనిపించింది. చంద్రబాబు పర్యటన ఆద్యంతం జనసేన జెండాలతో పాటు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ జెండాలు కూడా దర్శనమిచ్చాయి. అయితే గతానికి భిన్నంగా జూనియర్ ఎన్టీఆర్ సీఎం నినాదాలు మాత్రం వినిపించలేదు. దీంతో ఆ మేరకు చంద్రబాబుకు కూడా ఊరట దక్కినట్లయింది. అదే సమయంలో భవిష్యత్ రాజకీయాలకు చంద్రబాబు పల్నాడు టూర్ ద్వారా సంకేతాలు లభించినట్లయింది. పల్నాడులో పవన్, జూనియర్ జెండాలు ఒకేచోట కనిపించడం కూడా ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. వచ్చే ఎన్నికల్లో వీరిద్దరూ కలిసి విపక్ష కూటమికి ప్రచారం చేస్తే కచ్చితంగా ప్రభావం పడటం ఖాయమనే చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications