పవన్ కామెంట్స్ పై స్పందించిన చంద్రబాబు-సీరియస్ వార్నింగ్...!
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక చక్కటి సమన్వయంతో పనిచేస్తున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక విషయాల్లో ఆ ఎఫెక్ట్ కనిపించేలా చూసుకుంటున్నారు. గత నెలలో రాష్ట్రంలో శాంతి భద్రతలపై పవన్ లేవనెత్తిన అంశాలు, ఆ తర్వాత కేబినెట్లో సోషల్ మీడియా కార్యకర్తల తీరుపై చేసిన విమర్శలపై ఘాటుగా స్పందించిన చంద్రబాబు.. సంచలన నిర్ణయాలు తీసుకుని వెంటనే అమల్లో పెట్టేశారు. ఇప్పుడు కాకినాడ పోర్టులో రేషన్ మాఫియాపైనా పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించారు.
నిన్న కాకినాడ పోర్టుకు వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు పలు షాకులు తప్పలేదు. రెండు నెలలుగా కాకినాడ పోర్టుకు రానివ్వకుండా అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని, తాను వస్తుంటే ఎస్పీ సెలవుపై వెళ్లిపోతున్నారని, తనను రేషన్ బియ్యం ఉన్న షిప్ వద్దకు వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారని పవన్ చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. చివరకు రేషన్ మాఫియాను ఇలాగే వదిలేస్తే రేపు డ్రగ్స్ , పేలుడు పదార్ధాలు కూడా ఎగుమతి చేస్తారని సంచలన విమర్శలు చేశారు. దీనిపై చంద్రబాబు ఇవాళ అనంతపురంలో స్పందించారు.

రేషన్ బియ్యం కొని కొందరు విదేశాలకు అమ్ముతున్నారని, రేషన్ బియ్యం వ్యాపారుల్ని వదిలిపెట్టబోమని చంద్రబాబు అనంతపురం పర్యటనలో హెచ్చరించారు. రేషన్ మాఫియాపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఎక్కడ చూసినా మాఫియా, దోపిడీ ఉందని, అంతా ప్రక్షాళన చేస్తామంటూ చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు. నిన్న పవన్ కామెంట్స్ పై వెంటనే స్పందించని చంద్రబాబు.. ఇవాళ అనంతపురంలో చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే వీటిని సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications