వైసీపీకి మరో బిగ్ షాక్ - ఆ గుట్టు విప్పేలా సర్కార్ కీలక ఆదేశాలు జారీ..!
ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే పలు అంశాల్లో కూటమి ప్రభుత్వం విపక్ష వైసీపీకి షాకులిస్తోంది. ఇదే క్రమంలో తాజాగా ఇవాళ మరో అంశంలో కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రహస్యంగా ఉంచిన పలు జీవోల్ని ప్రస్తుత జీవోఐఆర్ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని కూటమి సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు వాటిని వెంటనే అప్ లోడ్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది.

వైసీపీ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పలు ఉత్తర్వులు రహస్యంగా ఉంచేవారు. వాటిని ప్రత్యేక వెబ్ సైట్ లో ఉంచేవారు. దీంతో ఆ ఉత్తర్వుల్లో ఏముందో ఎవరికీ తెలిసేది కాదు. ఆ తర్వాత ఎప్పుడో వాటి పర్యవసానాలు బయటపడ్డ తర్వాత విషయం అందరికీ తెలిసేది. ఈ నేపథ్యంలో జీవోలు రహస్యంగా ఉంచకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. వీటిపై విచారణ సందర్భంగా హైకోర్టు అప్పటి వైసీపీ సర్కార్ పై అక్షింతలు కూడా వేసింది. అయినా ఏ మార్పూ ఉండేది కాదు.
తాజాగా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక పాత జీవోఐఆర్ వెబ్ సైట్ పునరుద్ధరించడంతో పాటు వాటిలోనే అన్ని జీవోలు పెడుతున్నారు. దీనికి కొనసాగింపుగా గతంలో వైసీపీ హయాంలో రహస్యంగా ఉంచేసిన పలు జీవోల్ని కూడా ఇందులోనే అప్ లోడ్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ 2008 నుంచి జారీ అయిన అన్ని జీవోల్ని ప్రస్తుత జీవోఐఆర్ వెబ్ సైట్ లో చేయబోతోంది. త్వరలో ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. అది జరిగితే వైసీపీ హయాంలో ఇచ్చిన పలు రహస్య ఉత్తర్వులు బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications