మహిళలకు కూటమి సర్కార్ బిగ్ షాక్- ఆ పథకం జూన్ తర్వాతే ?
ఏపీలో కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు కారణమైన ఎన్నికల హామీలను నిలబెట్టుకునే విషయంలో తడబాటు స్పష్టంగా కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తయినా పింఛన్ పథకం, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ మినహా మరో పథకం అమలు చేయలేదనే విమర్శలు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మహిళల కోసం ఉద్దేశించిన మరో పథకం అమలు విషయంలో వారికి షాకిచ్చింది.
మహిళల కోసం కూటమి సర్కార్ సూపర్ సిక్స్ తో పాటు తమ ఉమ్మడి మ్యానిఫెస్టోలో పలు హామీలు ఇచ్చింది. వీటిలో కీలకమైనది మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం. తాము అధికారంలోకి రాగానే మహిళల కోసం ఈ పథకం అమలు చేసి తీరుతామని చెప్పిన కూటమి పార్టీలు ఇప్పుడు దాని అమలు విషయంలో మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రంలో ఈ ఆరునెలల్లో పెన్షన్ల పెంపు మినహా బారీగా ఖర్చు పెట్టి అమలు చేసిన పథకాలేవీ లేవు. దీంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంతో పాటు రైతుల కోసం ఉద్దేశించిన అన్నదాత సుఖీభవ, విద్యార్ధులకు గతంలో అమ్మఒడి పేరుతో ఇచ్చిన పథకం ఇప్పుడు పేరు మారి తల్లికి వందనంగా అమలు చేయాల్సి ఉంది. అయితే ఈ రెండు పథకాలను అమలు చేయకుండా మహిళ ఉచిత బస్సు ప్రయాణ పథకానికి నిధులు కేటాయించే పరిస్ధితి లేదు. దీంతో దీన్ని ప్రస్తుతానికి వాయిదా వేసేశారు.
రాష్ట్రంలో కొత్త ఏడాదిలో అమలు చేయాల్సిన పథకాలపై నిన్న కేబినెట్ భేటీలో మంత్రులతో చర్చించిన సీఎం చంద్రబాబు.. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో రైతన్నకు భరోసాగా ఇచ్చే అన్నదాత సుఖీభవ పథకాన్ని ముందుగా అమలు చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత విద్యార్ధుల కోసం తల్లికి వందనం పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం లోపు అంటే జూన్ లోపు అమలు చేయాలని నిర్ణయించారు. ఈ రెండింటి తర్వాతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేయబోతున్నారు. ఈ మేరకు మంత్రులకు చంద్రబాబు క్లారిటీ ఇచ్చేశారు.












Click it and Unblock the Notifications