టూర్ రద్దు - చంద్రబాబు కీలక ఆదేశాలు..!!
ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ నగరంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు వర్షాల పైన అధికారులతో సమీక్ష చేసారు. కీలక ఆదేశాలు జారీ చేసారు. ఈ రోజు పెన్షన్ల పంపిణీ కోసం చంద్రబాబు కర్నూలు జిల్లాలో పర్యటించాల్సి ఉండగా..వర్షాల కారణంగా రద్దు అయింది. పలు ప్రాంతాల్లో వర్షం కారణంగా ఏర్పడుతున్న ఇబ్బందుల పైన ముఖ్యమంత్రి అధికారులకు దిశా నిర్దేశం చేసారు.
సమీక్ష
ఓర్వకల్లు పర్యటన రద్దు చేసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష చేసారు. రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని...పూర్తి అప్రమత్తంగా ఉండాలని యంత్రాంగానికి సిఎం ఆదేశించారు. కింది స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్క అధికారి పూర్తి అప్రమత్తంగా ఉండాలని సీఎం నిర్దేశించారు. భారీ వర్షాలు, వరదల సమయంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయి అప్రమత్తతో ఉంటే ప్రజల ఇబ్బందులను తగ్గించవచ్చన్నారు. ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ శాఖ సమన్వయంతో చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు.

దిశా నిర్దేశం
పట్టణ ప్రాంతాల్లో రోడ్లపై భారీ స్థాయిలో నీరు చేరి ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగుతోందని చెప్పారు. వీటిపై దృష్టిపెట్టాలి. పరిస్థితికి అనుగుణంగా ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టి ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని సూచన చేసారు. వర్షాలు, వరదల కారణంగా తాగునీరు, ఆహారం కలుషితం అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. అల్లూరి జిల్లాలో కలుషిత ఆహారం ఘటన జరిగిందని ..వీటిపై అధికారులు సీరియస్ గా దృష్టిపెట్టాలన్నారు. బాధితులకు మెరుగైన వైద్యసాయం అందించాలని ఆదేశించారు. క్రైసిస్ మేనేజ్మెంట్ విషయంలో డ్రోన్లు వంటి టెక్నాలజీని విరివిగా వాడాలన్నారు.
అండగా నిలుస్తాం
డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు వర్షాలపై సమాచారం ఇవ్వాలని సూచించారు భారీ వర్షాల కారణంగా పింఛన్ల పంపిణీకి సమయం పెంచుతూ నిర్ణయించారు. వచ్చే రెండు మూడు రోజుల్లో సచివాలయ ఉద్యోగులు పింఛన్ల పంపిణీ పూర్తి చెయ్యవచ్చన్నారు. వర్షాలు లేని ప్రాంతాల్లో యధావిధిగా పింఛన్ల పంపిణీ కొనసాగుతుందని చెప్పారు. విజయవాడలో కొండచరియలు విరిగి ఇంటిపై పడిన ఘటనపై సిఎం విచారం వ్యక్తం చేశారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రకటించారు.












Click it and Unblock the Notifications