చంద్రబాబుకు బీజేపీ వరుస షాక్ లు..! అప్పుడే మొదలుపెట్టేశారా ?
ఏపీలో కూటమి సర్కార్ తొలి ఏడాది పాలన తర్వాత మ్యానిఫెస్టోలో సంక్షేమ పథకాల అమల్లో వెనుకబడ్డారన్న విమర్శలు వచ్చాయి. దీంతో చంద్రబాబు హడావిడిగా సూపర్ సిక్స్ పథకాల అమలులో వేగం పెంచారు. దీంతో పాటు ఇతర పథకాలపైనా చర్చిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎన్డీయే కూటమిలో భాగస్వామి అయిన బీజేపీ నేతలు ఆయనపై పరోక్షంగా విమర్శలు మొదలుపెట్టేశారు. ఏపీతో పాటు తెలంగాణకు చెందిన బీజేపీ నేతలు కూడా ఈ దాడిలో ముందున్నారు.
ఎెంతసేపూ అభివృద్ధి గురించి ఆలోచిస్తూ సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదన్న ముద్రను చెరిపేసుకునేందుకు సీఎం చంద్రబాబు ఈసారి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు సూపర్ సిక్స్ లో రెండు మినహా మిగిలిన పథకాలను తాజాగా అమలు చేసేశారు. దీంతో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందంటూ సంతోషంగా చెప్పుకుంటున్నారు. అయితే ఈ పథకాల్లో అన్నదాత సుఖీభవ ఎలాగో కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం కిసాన్ లో లింక్ కలిగి ఉంది. కానీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం మాత్రం కేంద్రంతో సంబంధం లేదు. అలాగే తల్లికి వందనం కూడా పూర్తిగా రాష్ట్ర పథకమే.

కానీ ఏపీ, తెలంగాణకు చెందిన బీజేపీ నేతలు లంకా దినకర్ (20 సూత్రాల అమలు పథకం ఛైర్మన్), కొంపెల్ల మాధవీలత (హైదరాబాద్ బీజేపీ నాయకురాలు) పరోక్షంగా ఉచిత పథకాలపై చర్చను సడన్ గా తెరపైకి తెచ్చారు. ముందుగా మాధవీలత ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో మహిళలకు ఉపయోగం ఏంటని, వారు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. వారికి కావాల్సిన ఉపాధి, ఉద్యోగాలు కల్పించాల్సింది పోయి ఈ ఉచిత ప్రయాణాలేంటని ఆమె చిరుబుర్రులాడారు. ఇది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నారనుకున్నా అక్కడ పథకం మొదలై చాలా కాలమైంది. తాజాగా ప్రారంభించింది ఏపీనే.

అలాగే ఏపీ బీజేపీ నేత లంకా దినకర్ సైతం మితిమీరిన ఉచిత పథకాలపై జాతీయ స్దాయిలో చర్చ జరగాలంటూ మరో స్వరం వినిపించారు. రాష్ట్రంలో 20 సూత్రాల పథకం అమలు కమిటీ ఛైర్మన్ గా ఉన్న ఆయన ఇతర రాష్ట్రాల్లో పథకాల అమలుకు గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అయినా ఆయన ఉచితాలపై జాతీయ స్థాయి చర్చను కోరుతున్నారు. అంతే కాదు బీజేపీ పాలిన రాష్ట్రాలైన రాజస్దాన్, యూపీ, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ లో తరహాలోనే ఆచరణీయమైన పథకాల మోడల్ ను అధ్యయనం చేసి చంద్రబాబుకు నివేదిక ఇస్తానంటున్నారు. ఇదంతా చూస్తుంటే బీజేపీ అప్పుడే చంద్రబాబుపై మొదలు పెట్టేసిందా అన్న చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications