ఢిల్లీ కేంద్రంగా చంద్రబాబు కొత్త వ్యూహం- షా తో భేటీ వెనుక : జగన్ వ్యూహాన్నే ఇప్పుడు రివర్స్ లో..!!
టీడీపీ అధినేత చంద్రబాబు 2019 ఎన్నికల ఫలితాల తరువాత..ఇప్పుడు తిరిగి యాక్టివ్ అయ్యారు. టీడీపీ కార్యాలయాల పైన దాడుల అంశాన్ని తనకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఏపీలోని రాజకీయ పార్టీలతో పాటుగా ఆమ్ ఆద్మీ పార్టీ సైతం టీడీపీ కార్యాలయం పైన దాడులను ఖండించింది. ఇప్పుడు 36 గంటల దీక్ష ద్వారా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నాలు ప్రారంభించారు. దాడి జరిగిన వెంటనే గవర్నర్ తో పాటుగా నేరుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు చంద్రబాబు ఫోన్ చేసి ఫిర్యాదు చేసారు.

ఢిల్లీ కేంద్రంగా చంద్రబాబు అడుగులు
ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం పైన ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించారు. దీని కోసం రాష్ట్రపతితో పాటుగా అమిత్ షా అప్పాయింట్ మెంట్ చంద్రబాబు కోరారు. శనివారం ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే, అమిత్ షా అప్పాయింట్ మెంట్ ఇస్తారా లేదా అనే చర్చ సాగుతోంది. రాజకీయంగా 2014 ఎన్నికల్లో బీజేపీ - టీడీపీ కలిసి పోటీ చేసి రెండు పార్టీలు అటు కేంద్రంలో..ఇటు రాష్ట్రంలో భాగస్వాములు గా ఉన్నాయి. 2019 ఎన్నికల ముందు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన టీడీపీ అధినేత..ప్రధాని మోదీకి వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేసారు.

జగన్ ను వారికి దూరం చేయటమే లక్ష్యంగా
కాంగ్రెస్ నేతలతో కలిసి మోదీ ఓటమి కోసం పని చేసారు. కానీ, 2019 ఎన్నికల్లో చంద్రబాబు అంచనాలు రివర్స్ అయ్యాయి. ఏపీలో అధికారం కోల్పోవటంతో పాటుగా కేంద్రంలో మోదీ గతం కంటే ఎక్కువ మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. ఇక, ఇదే సమయంలో చంద్రబాబు పైన భారీ విజయం సాధించిన జగన్ తొలి సారి తనను కలవటానికి వచ్చిన సమయంలో మోదీ రిసీవ్ చేసుకున్న విధానం ద్వారా ఆయన ఎంతగా చంద్రబాబు పైన ఆగ్రహంతో ఉన్నారనే విషయం స్పష్టంగా కనిపించిందంటూ అప్పట్లోనే విశ్లేషణలు వినిపించాయి.

అమిత్ షా తో భేటీతో ప్రారంభించి
ఇక, బీజేపీతో తిరిగి సయోధ్య కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా..అక్కడి నుంచి సానుకూల సంకేతాలు లేవని తెలుస్తోంది. ఈ సమయంలో చంద్రబాబు 2019 ఎన్నికల తరువాత ఇప్పటి వరకు ఢిల్లీ వెళ్లి బీజేపీ ముఖ్య నేతలు..కేంద్ర మంత్రులను కలవలేదు. ఇక, ఏపీలో జగన్ ముందస్తుగానే ఎన్నికలకు సిద్దం అవుతున్న సమయంలో చంద్రబాబు ఇప్పుడు పార్టీ కార్యాలయాల పైన దాడుల అంశంతో ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించారు. అయితే, రాజకీయ విభేదాలు ఏ విధంగా ఉన్నా.. ఒక పార్టీ నుంచి తమ సమస్యలు చెప్పుకొనేందుకు హోం శాఖ మంత్రిగా అప్పాయింట్ మెంట్ ఇస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు.

నాటి జగన్ వ్యూహాన్నే..నేడు చంద్రబాబు
కానీ, ఈ అప్పాయింట్ మెంట్ ద్వారా ఢిల్లీలో తనకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులను అనుకూలంగా మలచుకొనేందుకు చంద్రబాబు వేగంగా వ్యూహాలు అమలు చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఇదే సమయంలో జగన్ సైతం అలర్ట్ అయ్యారు. 2019 ఎన్నికల ముందు జగన్ తన వ్యూహాల్లో భాగంగా ఎన్డీఏకు టీడీపీని దూరంగా చేయటంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు వ్యూహం సైతం అదే విధంగా కనిపిస్తోంది. కేంద్ర పెద్దలతో జగన్ సఖ్యతగా ఉండటంతో...ముందుగా ఆ సంబంధాల పైన దెబ్బ కొట్టాలనేది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది.

జగన్ ను దెబ్బ తీయాలంటే తిరిగి ఆ పొత్తులతోనే
దీని ద్వారా రాష్ట్రంలో కొత్త పొత్తులతో జగన్ ను ఎదుర్కొనేందుకు అడుగులు వేయాలని భావిస్తున్నారు. కానీ, జగన్ అండ్ టీం తాము ఒంటరిగాన పోటీ చేస్తామని చెబుతోంది. ఇక, చంద్రబాబు ఢిల్లీ వెళ్లే సమచారంతో వైసీపీ రాజకీయంగా అప్రమత్తమైంది. తిరుపతిలో అమిత్ షా కార్ల పైన రాళ్ల దాడి.. మోదీ పైన చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తోంది. అయితే, చంద్రబాబుతో మాత్రం తిరిగి కలిసే ప్రసక్తి లేదని ఏపీకి చెందిన కీలక నేతల వద్ద ప్రధాని మోదీ వ్యాఖ్యానించినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి.

బీజేపీ నేతలు చంద్రబాబును అంగీకరిస్తారా
పార్టీ నేతలతో అమిత్ షా తో సహా.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ సైతం ఇదే అంశాన్ని పలుమార్లు ప్రస్తావించారు. ఇక, ఇప్పుడు చంద్రబాబు మొదటి అడుగుగా అమిత్ షా తో దాడుల విషయం పైనే చర్చించినా..తరువాత రాజకీయంగా దానిని కంటిన్యూ చేయటానికి ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి. 2024 ఎన్నికల్లో టీడీపీకి..వ్యక్తిగతంగా చంద్రబాబుకు జీవన్మరణ సమస్యగా మారబోతున్నాయి. జగన్ ను దెబ్బ తీయాలంటే 2014 పొత్తులు అనివార్యమని టీడీపీ బలంగా నమ్ముతోంది.
Recommended Video

ఢిల్లీ పర్యటనతో ఫుల్ క్లారిటీ
ఏపీలో ఇప్పుడు బీజేపీ - జనసేన మధ్య పొత్తు కొనసాగుతోంది. టీడీపీ తో కలవటానికి జనసేనకు అభ్యంతరం ఉండే అవకాశాలు లేవు. బీజేపీ నేతలతో పొత్తు కంటే ముందుగా జగన్ తో వారి సంబంధాలను బలహీనపర్చటమే టీడీపీ అధినేత లక్ష్యంగా కనిపిస్తోంది. మరి..ఢిల్లీ కేంద్రంగా చంద్రబాబు వేస్తున్న అంచనాలు..ప్రణాళికలకు కేంద్ర బీజేపీ నేతలు ఎంత వరకు సహకరిస్తారో.. ఏ మేర చంద్రబాబు అంచనాలు ఫలిస్తాయో చూడాలి.












Click it and Unblock the Notifications