బాబు వైఖరి అస్పష్టం: రఘువీరా, సహకరిస్తామని..
అనంతపురం: రైతుల రుణాల మాఫీపై తెలుగుదేశం పార్టీ అధినేత, కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరి అస్పష్టతగా ఉందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అన్నారు. ఆయన శనివారం అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయని, ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కొంత అస్పష్టతకు గురి చేస్తున్నాయని తెలిపారు.
ఖరీఫ్ సీజన్ మొదలైనందున బ్యాంకుల్లో రైతుల రుణాలు రెన్యూవల్ చేయాలని కొత్త ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు రఘువీరా రెడ్డి చెప్పారు. జూన్ నెలలో కొత్త రుణాలు ఇవ్వాల్సి ఉందన్నారు. తనకు వ్యవసాయశాఖ మంత్రిగా చాలా అనుభవం ఉందని చెప్పిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 48వేల కోట్ల రుణాలు రైతులకు అందించామని చెప్పారు. రైతులను ప్రభుత్వం ఆదుకోకపోతే వ్యవసాయం కూనరిల్లుతుందని ఆయన అన్నారు.

చంద్రబాబు నాయుడు రైతుల రుణాలపైనే మొదటి సంతకం పెట్టాలని రఘువీరా రెడ్డి కోరారు. అప్పుడే రైతులకు కొత్త రుణాలు వస్తాయని అన్నారు. తమకు బాధ్యత ఉంది కాబట్టి, రైతుల పక్షాన ప్రభుత్వాన్ని కోరుతున్నామని చెప్పారు. మార్చి 31న ప్రకటించిన తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రణాళికలో కూడా రైతుల రుణమాఫీ చేర్చారని గుర్తుచేశారు. రైతులకు విత్తనాలు, ఇన్ పుట్ సబ్సిడీ అందించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిమిత కాలంపాటు ప్రత్యేక హోదా కల్పిస్తున్నందున పరిశ్రమలు ఇబ్బడిముబ్బడిగా వస్తాయని, వాటికి కావాల్సిన మంచి వాతావరణాన్ని కొత్త ప్రభుత్వం కల్పించాలని సూచించారు. అందుకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని రఘువీరా రెడ్డి తెలిపారు. కొత్త ప్రభుత్వం కేంద్రం ఇచ్చే నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సీమాంధ్రలోని వెనకబడిన జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. అనంతపురం జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని తాము తీర్మానించినట్లు రఘువీరా తెలిపారు. కొత్త ప్రభుత్వానికి అన్ని విధాల సహకరిస్తామని పునరుద్ఘాటించారు.












Click it and Unblock the Notifications