విజయ్ సాయం కోరిన చంద్రబాబు..! రెస్పాన్స్ ఇదే..! నెక్ట్స్ లైన్ లో డీకే..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) ఇవాళ తొలిసారి తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ సాయం కోరారు. తాను ఎన్డీయే పాలిత రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, విజయ్ ఇండియా కూటమిలో భాగస్వామి అయిన కాంగ్రెస్ పార్ట్ నర్ అయినా, ఎలాంటి భేషజాలు లేకుండా ఆయన్ను సాయం అడిగారు. దీనిపై విజయ్ కూడా సానుకూలంగా స్పందించినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. రాజకీయాల్లో ఎంతో సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు.. ఇలా తొలిసారి సీఎం విజయ్ సాయం కోరడం చర్చనీయాంశమైంది.
ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కు ఫోన్ కాల్ చేశారు. ఏపీలో తుఫాను నేపథ్యంలో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థల పునరుద్ధరణకు తమిళనాడు ప్రభుత్వ సహాయం కోరారు. ఈ మేరకు ఫోన్ లో విజయ్ ను చంద్రబాబు సాయం అభ్యర్ధించారు. రాష్ట్రంలో రేపు, ఎల్లుండిలో రాబోయే మురసు తుఫాను వల్ల పెద్ద ఎత్తున విద్యుత్ పోల్స్ దెబ్బ తింటాయని, కాబట్టి వాటి పునరుద్ధరణకు సిబ్బందిని, యంత్రాలను పంపాలని చంద్రబాబు కోరారు. దీనికి విజయ్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

తుఫాన్ వల్ల విద్యుత్ వ్యవస్థలు దెబ్బతిన్న ప్రాంతాలకు అవసరమైన సిబ్బందిని, యంత్ర సామగ్రిని ఏపీకి పంపుతానని సీఎం విజయ్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్నబ్ తుఫాను వల్ల దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను పునరుద్దరించే పనుల్ని తెలంగాణ విద్యుత్ సిబ్బంది చేస్తున్నారు. ఇప్పుడు మురసు తుఫాన్ తర్వాత అవసరమైతే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకోవాలనే ఆలోచనలో ఏపీ సీఎం ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా వరుసగా చంద్రబాబు దక్షిణాదిలోని తమ పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్నాటకల సాయం కోరుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. తాజాగా ఓ సమావేశంలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, విజయ్, డీకే శివకుమార్ తో భేటీ అయిన చంద్రబాబు.. కలిసి ముందుకు సాగుదామని విజ్ఞప్తి చేశారు. దీంతో వారు కూడా సరైన సమయంలో సాయం అడగ్గానే చేసేందుకు ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది.














Click it and Unblock the Notifications
