సిరాచుక్క పడాల్సిన చోట రక్తపుచుక్కలు.. వైసీపీ ఓటమి భయంతోనే: చంద్రబాబు ధ్వజం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. నేడు పోలింగ్ సందర్భంగా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుందని, వైసిపి అడ్డంకులను అధిగమించి మరీ ప్రజలు ఓట్లు వేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఓటమి భయంతో రాష్ట్రవ్యాప్తంగా దాడులకు పాల్పడుతున్నారని, ఈ దాడులతో వైసిపి ఓటమిని ముందే అంగీకరించిందని స్పష్టం చేశారు.
శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు వైసిపి వ్యతిరేక పవనాలు
మండుటెండలను సైతం లెక్కచేయకుండా ప్రజలు ఓటింగ్లో పాల్గొనడం అభినందనీయమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఓటమి భయంతోనే మాచర్ల, రైల్వే కోడూరు, పుంగనూరులో వైసిపి పెట్రేగి పోయిందని, సిరా చుక్క పడాల్సిన చోట రక్తపు చుక్కలు పడేలా చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు వైసిపి వ్యతిరేక పవనాలు స్పష్టంగా కనపడ్డాయని పేర్కొన్న చంద్రబాబు, ఈ కారణంగానే అల్లర్లకు తెగబడుతున్నారని విమర్శించారు.

ఐదేళ్ల దౌర్జన్య కాండను ఎన్నికల వేళ కూడా కొనసాగిస్తున్నారు
క్యూలైన్లో రమ్మని ఓటరు అన్నందుకు తెనాలిలో అన్నాబత్తుని శివకుమార్ చేసిన దాడి దుర్మార్గమని, దాడులు, దౌర్జన్యాలు చేసి ప్రజాభిప్రాయాన్ని ఎవరు మార్చలేరని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఐదేళ్ల దౌర్జన్య కాండను ఎన్నికల వేళ కూడా కొనసాగిస్తున్నారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న దాడులు దుర్మార్గమని, బాధ్యుల పైన ఎన్నికల కమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు కూడా చేశామన్నారు చంద్రబాబు.
జగన్ పేరుతో ఐవీఆర్ఎస్ కాల్స్, టీడీపీ అభ్యర్థుల వాహనాలు ధ్వంసం
పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి జగన్ రెడ్డి పేరుతో ఓటర్లకు ఐవీఆర్ఎస్ కాల్స్ వస్తున్నాయని , నరసరావు పేటలో ఎంపీ అభ్యర్థి కృష్ణదేవరాయలు, మాచర్ల ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి వాహనాలపై దాడి చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. తక్కెళ్ళపాడు లో ఎస్సీ మహిళల పైకి ఎంపీ అభ్యర్థి కిలారి రోశయ్య కారు తో దూసుకు రావడం హేయమైన చర్య అన్నారు.
వైసీపీ నేతల్లో ఓటమి భయం
తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ఆయన కుమారుడు ఓటర్లను బెదిరింపులకు గురి చేశారని, ఆముదాల వలసలో తమ్మినేని సీతారాం అర్ధాంగి రిగ్గింగ్ కు పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. ఇన్ని దాడులకు ప్రధాన కారణం వైసిపి నేతలలో ఓడిపోతున్నామన్న భయమే నని చంద్రబాబు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications