వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కట్టుబట్టలతో, పవన్ విజ్ఞతకు థ్యాంక్స్: బాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కట్టుబట్టలతో బయటకు వచ్చామని, ఇబ్బందులతో బయటకు వచ్చామని తెలుగుదేశం శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వాటిని అధిగమించే ఆలోచన చేయాలని ఆయన అన్నారు. తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయంలో జరిగిన టిడిఎల్పీ సమావేశంలో ఆయన నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టిడిపి శాసనసభ్యులు పలువురు చంద్రబాబును ప్రశంసిస్తూ మాట్లాడారు. చివరగా చంద్రబాబు ప్రసంగించారు.

ఇక్కడికి వచ్చి టిడిఎల్పీ నాయకుడిగా ఎన్నికవుతానని అనుకోలేదని, ఇది అపూర్వ సంఘటన అని, ఈ మహత్తర సంఘటనను మరిచిపోలేనని ఆయన అన్నారు. నూతన రాష్ట్రం వచ్చిందని, మనం అనుకోవడం వల్ల వచ్చింది కాదని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాదులోనే అన్నీ జరిగేవని, ప్రస్తుతం తిరుపతిలో సమావేశమయ్యామని, విజయవాడ - గుంటూరు మధ్య ప్రమాణ స్వీకారం చేస్తానని ఆయన అన్నారు.

Chandrababu

మన సేవలు అవసరమనే వేంకటేశ్వర స్వామి తనను బతికించాడని, ఆ రోజు జరిగిన సంఘటనను ఆలోచించుకుంటే దెబ్బలు తగిలాయి గానీ ప్రాణనష్టం జరగలేదని, అపవాదు వస్తుందనీ తన సేవలు అవసరమని భావించి వెంకటేశ్వర స్వామి బతికించాడని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యమని నిరూపణ అయిందని, చాయ్ వాలా నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారని ఆయన అన్నారు. ఎస్వీ యూనివర్శిటీలో రాజకీయ ఓనమాలు నేర్చుకున్నట్లు ఆయన తెలిపారు.

తిరుపతిలో ఎన్టీ రామారావు తొలి ఎన్నికల్లో ఘన విజయం సాధించారని, ఎన్టీ రామారావు తిరుపతికి చేసిన సేవలు ఎన్నో ఉన్నాయని ఆయన అన్నారు. ఎన్టీ రామారావు నుంచి క్రమశిక్షణను, కఠోర శ్రమ చేయడాన్ని తాను నేర్చుకున్నట్లు ఆయన తెలిపారు. చరిత్ర ఉన్నంతవరకు, తెలుగుజాతి ఉన్నంత వరకు ఎన్టీ రామారావు ఇచ్చిన సందేశం ఉంటుందని, తెలుగుజాతిని ఐక్యం చేసి ముందుకు సాగుతామని ఆయన అన్నారు.

పదేళ్ల పాటు కాంగ్రెసు దారుణంగా రాష్ట్రాన్ని, దేశాన్ని భ్రష్టు పట్టించిందని ఆయన విమర్శించారు. అవినీతి, అసమర్థ ప్రభుత్వం పోవాలని, అందుకు నరేంద్ర మోడీ రావాలని బ్రహ్మాండంగా ఓటేసి గెలిపించారని ఆయన అన్నారు. 18 ఏళ్ల తర్వాత ఒకే పార్టీకి మెజారిటీ వచ్చిందని, సంకీర్ణాలు మాత్రమే వస్తాయని భావిస్తున్న తరుణంలో బిజెపికి బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చారని, కాంగ్రెసు అసమర్థతే అందుకు కారణమని ఆయన అన్నారు.

మళ్లీ గెలవాలనే ఉద్దేశంతో కాంగ్రెసు రాష్ట్ర విభజన చేసిందని, విభజన హేతుబద్దంగానూ న్యాయసమ్మతంగా ఉండాలని చెప్పానని, అందుకు భిన్నంగా కాంగ్రెసు ప్రవర్తించిందని ఆయన అన్నారు. అధికారం ఉందని ఏకపక్షంగా వ్యవహరించారని ఆయన అన్నారు. జీవితంలో ఎన్నడూ పడనంత టెన్షన్ తాను పడ్డానని ఆయన చెప్పారు. 1984లో కాంగ్రెసు ఎన్టీ రామారావును బర్తరఫ్ చేసిందని, మళ్లీ ఎన్టీ రామారావు తిరిగి అధికారంలోకి వచ్చిందని, తమను ఎప్పుడు కాంగ్రెసు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించినా తమకు మేలే జరిగిందని ఆయన అన్నారు.

తెలంగాణలో ఉండే ప్రజలూ సీమాంధ్ర ప్రజలూ సహకరించారు కాబట్టే తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నానని ఆయన అన్నారు. ఏదో ఒకటి చెప్పాలనీ ఎటు వైపు ఉన్నారో చెప్పాలనీ అడిగినప్పడు తాను ఇబ్బంది పడ్డానని, అటు కాకుండా ఇటు కాకుండా పోతున్నారని అన్నప్పుడు కుట్ర అని చెప్పి ప్రజలకు విషయాలు స్పష్టంగా చెప్పానని ఆయన అన్నారు.

కరణ్ థాపర్ ఢిల్లీలో దీక్ష చేసినప్పుడు మీరు మరో పొట్టి శ్రీరాములు అవుతున్నారా, కాదా అని అడిగారని, ఇరు ప్రాంతాలకూ ఆమోదయోగ్యంగా ఉండాలని చెప్పానని, రాజధాని కూడా లేకుండా విభజన చేస్తే ఎలా అంటే ఎవరూ పట్టించుకోలేదని ఆయన అన్నారు. తెలంగాణకు వెళ్తానంటే తెరాస అడ్డుకుందని, అయినా తాను అక్కడ తిరిగానని ఆయన చెప్పారు. సీమాంద్రకు వస్తానంటే ఇప్పుడు వద్దన్నారని, అయితే తాను ప్రజల ముందుకు వచ్చానని చెప్పి వచ్చానని, తాను చెప్పింది సరైందని ప్రజలు నిర్ణయం ప్రకటించారని ఆయన అన్నారు.

ప్రజల నమ్మకాలను నిలబెట్టుకున్న పార్టీ తమది మాత్రమేనని ఆయన అన్నారు. తాము చాలా కష్టాలు పడ్డామని, 300 మంది కార్యకర్తలు బలయ్యారని ఆయన చెప్పారు. పరిటాల రవీంద్రను కాపాడడానికి ఎన్నో ప్రయత్నాలు చేశానని, ఎవరూ పట్టించుకోలేదని ఆయన అన్నారు. కార్యకర్తల కాళ్లు మొక్కాల్సిన అవసరం ఉందని, ప్రాణాలు పోయినా ఫరవాలేదు పార్టీని కాపాడుకుంటామని పనిచేశారని, వారి రుణం తీర్చుకోవాలని ఆయన అన్నారు. నాయకులు పార్టీ నుంచి పోయారు తప్ప కార్యకర్తలు పోలేదని ఆయన అన్నారు.

పోరాట ఫలితంగా తాము విజయం సాధించామని ఆయన చెప్పారు. రైతాంగాన్ని ఆదుకోవాలని తాను అనుకున్నట్లు ఆయన తెలిపారు. అనంతపురం జిల్లాను చూసిన తర్వాత రుణమాఫీ చేస్తామని చెప్పానని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ వాటిని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు చెప్పారు.

విభజనలో జరిగిన పంపకాల తీరు సీమాంధ్రకు అన్యాయం జరిగే విధంగా ఉందని ఆయన చెప్పారు. ఎలా అన్యాయంగా ఉందో వివరించారు. ఢిల్లీలో జైరాం రమేష్ వచ్చి తనను కలిసినప్పుడు ఎందుకు కలిశారో అర్థం కాలేదని, సోనియా గాంధీ మోడీకి లేఖ రాసిన తర్వాత అర్థమైందని, తాము ఏదో చేశామనీ అది నెరవేర్చాలనీ చెప్పుకోవడానికి ఆ పని చేశారని ఆయన అన్నారు.

పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలుపుతూ ఇచ్చిన ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతి తిప్పి పంపించారని, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చింది కాబట్టీ తాను జాగ్రత్త పడి ప్రయత్నాలు చేశాను కాబట్టి ఆర్డినెన్స్ వచ్చిందని, లేదంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులు ఏర్పడేవని ఆయన అన్నారు. అన్యాయం జరిగిందని అనుకన్నప్పుడు ప్రజల్లో కసి, ఆగ్రహం కలుగుతుందని, మనం అటువంటి సందర్భంలో నమ్మకం కలిగించలేకపోతే తప్పుడు దారి పడుతుందని ఆయన అన్నారు. నమ్మకం కలిగించకపోవడం వల్లనే పంజాబ్‌లో సంఘటన జరిగిందని, కాశ్మీర్‌లో జరుగుతోందని ఆయన అన్నారు.

తన కుటుంబ సభ్యులు సహకరించరాని, బాలకృష్ణ సహకరించారని, పవన్ కళ్యాణ్ ఎంతో సహకరించారని, వారికి ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ విజ్ఞతతో వ్యవహరించారని ఆయన అన్నారు. హైదరాబాదును తానే అభివృద్ధి చేశానని ఆయన అన్నారు. హైదరాబాదులో శాంతిభద్రతలను అదుపు చేసి, సుస్థిరతను ఎన్టీ రామారావు తెచ్చారని, తాను వచ్చిన తర్వాత అభివృద్ధి చేశానని, దానివల్ల ఆదాయం పెరిగిందని ఆయన అన్నారు. అధికారం తమకు ముళ్ల కిరీటమని, ఎంతో శ్రమించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. చెప్పిన మాటను నిలబెట్టుకుంటామని ఆయన అన్నారు. సింగపూర్‌లా అభివృద్ధి చేస్తానని, వేరే రాష్ట్రాలు అసూయ పడే విధంగా చేస్తామని ఆయన అన్నారు.

English summary
Telugudesam party president Nara Chandrababu has been elected as the leader of TDLP at Tirupathi meeting. In thanks giving speech Chandrababu refuted the attitude of Congress in the bifurcation of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X