చంద్రబాబు ప్రమాణస్వీకారం.. భావోద్వేగానికి గురైన కుటుంబసభ్యులు, అమరావతి రైతుల ఆనంద భాష్పాలు!!
చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం అత్యంత ఘనంగా అంగరంగ వైభవంగా జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో అతిరథ మహారంగ ప్రజలందరూ చూస్తూ ఉండగా గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసంతో విధేయతను చూపుతానని భారత దేశ సర్వభూమాధికారాన్ని పరిరక్షించడానికి రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేశారు.
భావోద్వేగానికి గురైన అమరావతి రైతులు
ఇక చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని దేశమంతా తిలకించడం ఒక ఎత్తు అయితే అమరావతి రైతులు తిలకించడం ఒక ఎత్తు అని చెప్పొచ్చు. గత ఐదేళ్లపాటు అలుపెరగకుండా అమరావతి రాజధానిగా ఉండాలని పోరాటం చేసిన అమరావతి ప్రాంత రైతులు మహిళలు చంద్రబాబు నేడు సీఎంగా ప్రమాణస్వీకారం చేయడంతో సంతోషంలో మునిగి తేలుతున్నారు. తమ పోరాట ఫలితం ఇది అని వారు కన్నీరు పెట్టుకుంటున్నారు.

అమరావతి రైతులకు ఇది పండుగ రోజు
గుంటూరు జిల్లా తెనాలిలో అలాగే అమరావతి ప్రాంత పరిధిలోని అన్ని ప్రాంతాలలోనూ ఎల్ఈడి స్క్రీన్ లను ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని తిలకించారు. అమరావతి రూపకర్త చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవాన్ని వీక్షించిన అమరావతి ప్రాంత ప్రజలు జై అమరావతి జై చంద్రబాబు అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ రోజు నిజంగా అమరావతి ప్రాంత రైతులకు పండుగ రోజు అని అక్కడి రైతులు చెబుతున్నారు.
నారా, నందమూరి కుటుంబసభ్యులు ఎమోషనల్
ఇంతకాలం వినాశనానికి విధ్వంసానికి గురైన అమరావతి ఇకపై వెలుగులను విరజిమ్ముతుందని వారు సంతోషం వ్యక్తం చేశారు ఇక మరోవైపు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఇటు ప్రజలే కాదు కుటుంబ సభ్యులు కూడా బాగా ఎమోషనల్ అయ్యారు. నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి తో పాటు నందమూరి కుటుంబ సభ్యులు కూడా ఎమోషనల్ అయ్యారు. సభకు హాజరైన వారంతా జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు.
నాల్గవ సారి చంద్రబాబు ప్రమాణం .. అభినందించిన ప్రధాని మోడీ
విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకసారి సీఎంగా పనిచేసిన ఆయన మళ్లీ నేడు రెండవసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగవసారి. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చంద్రబాబును అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.












Click it and Unblock the Notifications