చంద్రబాబు కేబినెట్లోకి వైసీపీ బాధిత నేతలకు చోటు ? రేసులో అచ్చెన్న, ధూళిపాళ్ల, కొల్లు..!
ఏపీలో ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు కేబినెట్ కూర్పుపై దృష్టిసారించారు. ఇందులో ఈసారి కచ్చితంగా గత వైసీపీ ప్రభుత్వానికి టార్గెట్ అయి నానా ఇబ్బందులు పడిన పలువురు నేతలకు అవకాశం కల్పించే దిశగా అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచి అరెస్టులకు సైతం వెరవని నేతలకు అండగా నిలవడం ద్వారా క్యాడర్ కు పాజిటివ్ సంకేతాలు పంపుతారనే ప్రచారం జరుగుతోంది.
గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ, ప్రజల గొంతు వినిపించిన టీడీపీ నేతలపై వైసీపీ సర్కార్ అక్రమ కేసులు బనాయించింది. తమ రాజకీయ జీవితాల్లో మచ్చలేకుండా మెలిగిన కొందరు సీనియర్లను జైల్లో పెట్టించింది. ఇందులో అచ్చెన్నాయుడు, నారాయణ, ధూళిపాళ్ల నరేంద్ర, కొల్లు రవీంద్ర, చింతకాలయ అయ్యన్నపాత్రుడు వంటి నేతలున్నారు. వీరంతా పార్టీలో సీనియర్లే. దీంతో ఐదేళ్లుగా వైసీపీ వేధింపులను తట్టుకొని పార్టీ కోసం విధేయతతో పనిచేసిన నాయకులకు తన కేబినెట్ లో చోటివ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం.

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడుపై ఈఎస్ఐ కుంభకోణం పేరుతో వైసీపీ సర్కార్ జైలులో పెట్టి వేధించింది. అలాగే సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రపై ఐదేళ్లలో ఏకంగా 16కేసులు బనాయించి రాజమండ్రి జైలులో పెట్టించింది. సంగం డెయిరీని హస్తగతం చేసుకోవాలని వైసీపీ చేసిన ప్రయత్నాలకు ధూళిపాళ్ల అడ్డుకట్ట వేయగలిగారు. ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ధూళిపాళ్ల నరేంద్రకు గతంలో వివిధ కారణాలతో మంత్రి పదవి ఇవ్వలేకపోయారు. ఈసారి మాత్రం కచ్చితంగా ఇవ్వాలనే డిమాండ్లు ఉన్నాయి.
ఇదే కోవలో చంద్రబాబుతో పాటు కేసులు ఎదుర్కొన్న మాజీ మంత్రి నారాయణ, విశాఖలో కేసులు ఎదుర్కొన్న అయ్యన్నపాత్రుడు, బందరులో వేధింపులు, కేసులు ఎదుర్కొని జైలుకు వెళ్లిన కొల్లు రవీంద్ర వంటి వారిని ఈసారి మంత్రి పదవులతో గౌరవించాలనే డిమాండ్ పార్టీలోనూ వినిపిస్తోంది. దీంతో చంద్రబాబు వీరందరికీ తప్పకుండా మంత్రులుగా అవకాశం ఇస్తారని భావిస్తున్నారు. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.












Click it and Unblock the Notifications