ఇంత అన్యాయమా: మోడీ ప్రభుత్వంతో చంద్రబాబు ఢీ?
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోది. రెవెన్యూ లోటు భర్తీకి కేవలం రూ.500 కోట్లు విడుదల చేస్తూ కేంద్రం తీసుకొన్న నిర్ణయం పట్ల ఆయన తీవ్ర ఆసంతృప్తితో ఉన్నట్లు శనివారం మీడియాలో వార్తలు వచ్చాయి.
అది అన్యాయమంటూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. నిధుల కేటాయింపులపై ఇప్పటివరకూ చంద్రాబబు ఢిల్లీలో ప్రధానిని, మంత్రులను కలిసి నిధులను, ఇతర ప్రయోజనాలను రాబట్టుకునే ప్రయత్నాలు సాగిస్తూ వచ్చారు.

కానీ, ఇప్పుడు చంద్రబాబు తీవ్రంగా ప్రతిస్పందించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శుక్రవారం విజయవాడలో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఇందులో కేంద్రం తాజాగా విడుదల చేసిన నిధులపై చర్చ జరిగింది.
విభజన చట్టం మేరకు కేంద్రం 2014 - 15 లోటను భర్తీ చేయాల్సి ఉంటుందని, అయితే ఇప్పటి వరకు రూ.2300 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చిందని, ఇప్పుడు రూ.500 కోట్లు ఇస్తామని చెప్పిందని, దాంతో 16,300 కోట్లలో రాష్ట్రాన్ని కేంద్రం ఇస్తోంది రూ.3,300 కోట్లు మాత్రమేనని, ఈ కొద్ది మొత్తం ఇవ్వడానికి కేంద్రం రేండేళ్లు తీసుకుందని, మిగతా రూ.13 వేల కోట్ల రూపాయలు ఎప్పుడు ఇస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడిందని ఎపి ఆర్థిక శాఖ అధికారులు చెప్పినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. పరిస్థితులు వివరిస్తూ త్వరలోనే ప్రధానికి లేఖ రాస్తానని చంద్రబాబు అధికారులతో చెప్పినట్లు తెలుస్తోంది. రావాల్సినవి రాబట్టుకోవడానికి కేంద్రంపై ఒత్తిడి పెంచుదామని ఆయన అన్నారు.
కాగా, మార్చి 31నాటికి రూ.1.17 లక్షల కోట్లు ఖర్చు చేశాం. ఇది బడ్జెట్ అంచనాలకంటే నాలుగు వేల కోట్లు అదనమని, ప్రణాళికేతర వ్యయాన్ని బడ్జెట్ అంచనాలకంటే సుమారు పది శాతం తగ్గించగా, ప్రణాళికా వ్యయం సుమారు 34 శాతం పెరిగింది. ఈ లక్షణాలన్నీ ప్రగతికి సూచికలని మంత్రి యనమల వివరించారు.












Click it and Unblock the Notifications