గంగిరెడ్డిని పారిపోనిచ్చారు, నాపై కుట్ర: చంద్రబాబు
హైదరాబాద్: తనపై అలిపిరి వద్ద హత్యాయత్నం చేయడం సహా పలు క్రిమినల్ కేసులు, ఎర్ర చందనం స్మగ్లింగ్ వ్యవహారాలతో సంబంధం ఉన్న కొల్లం గంగిరెడ్డి దేశం వదిలి పారిపోయాడని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తనకు గంగిరెడ్డి నుంచి ప్రాణహాని ఉన్నదని తెలిసినా పోలీసులు వెళ్లనిచ్చారని ఆరోపించారు.
ఇదంతా చూస్తుంటే తనకు వ్యతిరేకంగా రాజకీయ కుట్ర జరుగుతున్నదని అనిపిస్తోందని ఆయన అన్నారు. ఈ మేరకు శుక్రవారం గవర్నర్ నరసింహన్‌కు లేఖ రాశారు. గంగిరెడ్డిని పట్టుకునేందుకు చర్యలు తీసుకోవాలని, అవసరమైతే రెడ్ కార్నర్ నోటీసు ఇవ్వడానికీ సిద్ధపడాలని ఆ లేఖలో చంద్రబాబు సూచించారు. ముఖ్యంగా గంగిరెడ్డి పరారీలో పోలీసుల పాత్రని నిగ్గు తేల్చాలని కోరారు.

బెయిల్‌పై బయట ఉన్న కొల్లం గంగిరెడ్డి దేశం వదిలి పరారయ్యాడని, 2003 నాటి అలిపిరి మందుపాతర ఘటన సహా అనేక నేరాలకు సంబంధించిన కేసులపై హైకోర్టులో విచారణ జరుగుతోందని ఆయన చెప్పారు. అంతర్జాతీయ స్మగ్లర్లతో కుమ్మక్కయి చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో గంగిరెడ్డి పెద్దఎత్తున ఎర్ర చందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడని, అతడి అక్రమ కార్యకలాపాల వివరాలను లేఖల రూపంలో ఎప్పటికప్పుడు మీ కార్యాలయానికి (రాజ్‌భవన్) తెలియజేస్తూనే ఉన్నామని ఆయన అన్నారు.
తమ నిరంతర ప్రయత్నాల వల్ల ఎట్టకేలకు గంగిరెడ్డిని పోలీసులు అరెస్టు చేయగా, హైకోర్టు బెయిల్ ఇచ్చిందని, ఆ వెంటనే గంగిరెడ్డి దుబాయ్‌కు పారిపోయినట్టు వార్తలు వచ్చాయని, పోలీసు యంత్రాంగం అసమర్థ, బాధ్యతారాహిత్య వైఖరి వల్లనే గంగిరెడ్డి సులువుగా దేశం దాటి పోగలిగాడని చంద్రబాబు అన్నారు.
గంగిరెడ్డి నుంచి తనకు ప్రాణ హాని ఉందన్న సమాచారం ఉన్నా గంగిరెడ్డి కదలికలపై నిఘా పెట్టడంలో పూర్తిగా విఫలమయ్యారు. గంగిరెడ్డిని చేజారిపోనిచ్చిన పోలీస్ అధికారులపై అవసరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని ఆయన అన్నారు. గంగిరెడ్డి పరారీ ఏదో యాదృచ్చికంగా జరిగినట్టు తాను భావించడం లేదని, దీని వెనక స్పష్టమైన రాజకీయ కుట్ర ఉన్నదనిపిస్తోందని ఆయన అన్నారు. పరారీ ఘటనతో సంబంధం ఉన్న వ్యక్తుల గురించి, వారికీ గంగిరెడ్డికి గల సంబంధం గురించి దర్యాప్తు జరిపించాలని చంద్రబాబు కోరారు.












Click it and Unblock the Notifications