నేను ఓకేనా!: బాబు, పవన్‌కు సలహా, జనసేనపై బిజెపి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఐవిఆర్ఎస్ సిస్టమ్ ద్వారా ఆయా నియోజకవర్గాల అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. తన అభ్యర్థిత్వం పైన కూడా చంద్రబాబు ప్రజల అభిప్రాయాన్ని తీసుకోనున్నారు. ఐవిఆర్ఎస్ సిస్టమ్ ద్వారా చంద్రబాబు స్వరంతో కూడిన ఫోన్ సెల్ ఫోన్ ఉన్న వారికి వస్తుంది. వారి నియోజకవర్గంలో ఎవరు కావాలో వారు దాని ద్వారా చెప్పవచ్చు.
ఈ సందర్భంగా చంద్రబాబు ఆదివారం మాట్లాడారు. తన అభ్యర్థిత్వం పైనా ప్రజల అభిప్రాయం కోరుతానన్నారు. ఏ అభ్యర్థి అయితే బాగుంటుందో ప్రజలే చెప్పాలన్నారు. మీ ఊరు, మీ అభ్యర్థి మీ ఇష్టమే నా ఇష్టమని చంద్రబాబు అన్నారు. అభ్యర్థుల ఎంపికపై తాము ఇచ్చిన ఆప్షన్ నచ్చకుంటే ఏ అభ్యర్థి అయితే బాగుంటుందో ప్రజలు చెప్పాలన్నారు. ఈ నూతన పద్ధతికి తాను శ్రీకారం చుట్టినట్లు చెప్పారు.

పవన్ కళ్యాణ్ పైన స్పందన
ప్రయోగాలకు ఇది సమయం కాదని చంద్రబాబు జనసేన పార్టీని ఉద్దేశించి అన్నారు. రెండు రాష్ట్రాల అభివృద్ధి ఎవరి ద్వారా సాధ్యమో ఆలోచించాలన్నారు. భావసారుప్యత కలిగిన వారు తనతో కలిసి రావాలన్నారు. సుస్థిర పాలన అందించే వారిని ఎన్నుకోవాలని ప్రజలను కోరారు.
పదిహేను రోజుల్లో తెలంగాణలో పరిస్థితులు మారుతాయని చెప్పారు. టిడిపిలోకి వలసలు ప్రారంభమయ్యాయన్నారు. క్యారెక్టర్ లేని కెసిఆర్ తెలంగాణను అభివృద్ధి చేస్తారా అన్నారు. బడుగు, బలహీనవర్గాల వేదిక టిడిపి మాత్రమేనన్నారు. టిడిపికి ఓటేయడంతో పాటు నోటు ఇవ్వాలని కోరారు. తాను బిసి అజెండాను తీసుకోగానే పార్టీలన్నీ ఉలిక్కి పడ్డాయన్నారు.
పవన్ పార్టీపై ప్రకాశ్ జవదేకర్
తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులపై వారంలోగా తాము ప్రకటన చేస్తామని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ పైన తాము స్పందించబోమన్నారు. ఇప్పటికే మూడువందల మంది అభ్యర్థులను ప్రకటించామన్నారు.












Click it and Unblock the Notifications