రప్పా రప్పానా ? తాటతీస్తాం..! జగన్ కు చంద్రబాబు వార్నింగ్..!
ఏపీలో ఓవైపు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేసేందుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే మరోవైపు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాత్రం నేరస్తులకు వంతపాడుతూ వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు. నిన్న పల్నాడులో జగన్ టూర్ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు యోగాంధ్ర కోసం తాము చేస్తున్న ప్రయత్నాలు విజయవంతంగా కొనసాగుతున్నాయన్నారు.
రాష్ట్రంలో వైఎస్ జగన్ తాజా టూర్లపై స్పందించిన చంద్రబాబు.. ఇరుకు వీధుల్లో మీటింగ్స్ పెట్టి జనాల్ని ఇబ్బంది పెడతారా అని ఆయన్ను ప్రశ్నించారు. హింసను ప్రోత్సహిస్తూ పోలీసులపై నిందలు మోపుతారా అని అడిగారు. గతంలో రాష్ట్రంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్ధితులు చూశామా అని ప్రశ్నించారు. తాను నేరస్తులతో పోరాటాలు చేయాల్సి వస్తోందని, అయినా తాను ఎవరినీ టార్గెట్ చేయడం లేదని చంద్రబాబు వెల్లడించారు. ఇలాంటి ఘటనల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు.

విశాఖలో గిన్నిస్ రికార్డు స్ధాయిలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించేందుకు తాను ప్రయత్నిస్తుంటే మరోవైపు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని బాబు ఆరోపించారు. యోగా దినోత్సవాన్ని డైవర్ట్ చేసేందుకే ఇలాంటి పనులు చేస్తున్నారన్నారు. రప్పా రప్పా అంటున్నారని, గంగమ్మ జాతరలో పొట్టేలు నరికినట్లు నరికేస్తామంటున్నారని చంద్రబాబు ఆక్షేపించారు.
గతంలో చెడ్డపనులు చేసే వారిని రాజకీయాల నుంచి దూరం పెట్టే వారని, ఇప్పుడు వారినే వెనకేసుకుని తిరుగుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. గంజాయి, బెట్టింగ్ బ్యాచ్ లకు విగ్రహాలు పెడుతున్నారని, పోలీసులు వద్దన్నా పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. తాము ఎప్పుడైనా పోలీసులు వద్దంటే పర్యటనలు చేశామా అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు నేరాలకు పాల్పడుతున్నారని, అలాంటి వారిని ఉపేక్షించేది లేదన్నారు.

మ్యానిఫెస్టోపై టీడీపీ నేతల్ని నిలదీయాలని జగన్ ఇచ్చిన పిలుపుపై స్పందిస్తూ.. 2029లో ఎన్నికలు ఉంటాయని, ఇప్పుడు నీ వెంట వచ్చిన జనాన్ని చూసి తామెందుకు భయపడతామని ఆయన ప్రశ్నించారు. అప్పటికీ మీ ఆటలు ఎలా సాగుతాయనేది చూస్తామన్నారు. మీ భవిష్యత్తును తీర్చిదిద్దే నాయకుడి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు తెలిపారు. ప్రజలు అడిగితే తాము సమాధానం చెబుతామని, కానీ తమ నేతలను వైసీపీ శ్రేణులు నిలదీస్తే తాట తీస్తానన్నారు. ఇందులో సందేహం లేదన్నారు.












Click it and Unblock the Notifications