2035 నాటికి జనాభా పెరగకపోతే..? ఏం జరగబోతోందో చెప్పిన చంద్రబాబు..!
ఈ మధ్య ఏపీలో జనాభా తగ్గుదలపై తరచూ ఆందోళన వ్యక్తం చేస్తున్న సీఎం చంద్రబాబు జనాభా పెరగాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నారు. ముఖ్యంగా ఇద్దరు పిల్లలకే పరిమితం కావొద్దంటూ పదే పదే చెప్తున్నారు. ఇవాళ ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్లలో జరిగిన బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు అనంతరం ప్రజావేదికలో మాట్లాడారు. మరోసారి జనాభా పెరగాల్సిన అవసరాన్ని ఆయన గుర్తుచేశారు. అంతే కాదు దీనికి డెడ్ లైన్ కూడా ఇచ్చారు.
2035 నాటికి ఏపీలో జనాభా పెరగకపోతే ఊరిలో పిల్లలు ఉండరని, ముసలి వాళ్ళే ఉంటారని చంద్రబాబు హెచ్చరించారు. ఆ తర్వాత ఊర్లు కూడా ఉండవన్నారు. అందరూ చనిపోతే ఊర్లు ఏం ఉంటాయిని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. కాబట్టి ప్రజలు జనాభా పెరుగుదలపై దృష్టిసారించాలని పిలుపునిచ్చారు. పీ4 కార్యక్రమంలో భాగంగా ముప్పాళ్లలో స్థానిక కుటుంబాలతో ఆయన మాట్లాడారు. దేశంలో పుట్టిన ఏ వ్యక్తీ పేదరికంలో ఉండకూడదని చంద్రబాబు వెల్లడించారు. తల్లికి వందనం పథకాన్ని ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ వర్తింపచేస్తామన్నారు.

అనంతరం ముప్పాళ్లలోని బాలికల గురుకుల సంక్షేమ వసతి గృహాన్ని, పాఠశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో పాల్గొనడానికి ముప్పాళ్ల వెళ్లిన సీఎం చంద్రబాబు గురుకుల పాఠశాలకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. పాఠశాల అంతా కలియదిరిగారు. వంటశాల, భోజనశాలలో పరిశుభ్రతను పరిశీలించారు. కోడిగుడ్లు, బియ్యం, కూరగాయలు, సరుకుల నాణ్యతను పరిశీలించారు. భోజనం రుచిగా, నాణ్యతతో అందిస్తున్నారా అని విద్యార్థులను అడిగి సీఎం తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన మెనూ ప్రకారం అల్పాహారం, భోజనం అందిస్తున్నారా అని అడిగారు. అనంతరం డార్మెటరీని పరిశీలించారు.












Click it and Unblock the Notifications