దిగొచ్చిన కోడి; భారీగా తగ్గిన చికెన్ ధరలు; చికెన్ ప్రియులకు పండుగే!!
తెలుగు రాష్ట్రాల్లో కొండెక్కి కూర్చున్న కోడి ధరలు ఇప్పుడిప్పుడే తగ్గుతున్నాయి. నాన్ వెజ్ ప్రియులకు మొన్నటిదాకా షాకిచ్చిన చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. ఎండాకాలం మొత్తం ఎండల వేడికి కోళ్లు మృత్యువాత పడడంతో, ఎండల దెబ్బకు కోడి పిల్లలు ఎదగకపోవడంతో మార్కెట్లో డిమాండ్ కు తగ్గ చికెన్ ఉత్పత్తి కాక ధరలు విపరీతంగా పెరిగాయి.
అయితే ఇప్పుడు మార్కెట్లో చికెన్ డిమాండ్ తగ్గడంతో పాటు, వర్షాలు పడడంతో కోళ్ల మరణాలు తగ్గి ఉత్పత్తి పెరగడంతో చికెన్ ధరలు నిదానంగా దిగివస్తున్నాయి. నిన్నా మొన్నటి దాకా కొండెక్కి కూర్చుని దిగి రమ్మంటే రానంటూ కొక్కరకో అన్న కోడి ధరలు ఇప్పుడిప్పుడే తగ్గటం ప్రధానంగా కనిపిస్తుంది. దీంతో చికెన్ ప్రియులు సంతోష పడుతున్నారు.

ఇక ప్రస్తుతం శ్రావణ మాసం కావడంతో చాలామంది ఉపవాసాలు ఉంటారు. అంతే కాదు చాలా మంది శ్రావణ మాసం అన్ని రోజులూ నాన్ వెజ్ ముట్టుకోరు. దీంతో చికెన్ కొనుగోళ్ళు బాగా తగ్గాయి. శ్రావణమాసం ఎఫెక్టుతో ప్రస్తుతం చికెన్ ధరలు అమాంతం పడిపోయాయి. దాదాపు రెండు నెలల పాటు 300 రూపాయల నుంచి 340 రూపాయల వరకూ కేజీ చికెన్ ధరలు పలికాయి.
అయితే గత వారం రోజుల కాలంలో ఏకంగా వంద రూపాయల మేర చికెన్ ధరలు తగ్గాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో లైవ్ కోడి ధర 130 రూపాయలు కాగా, కిలో చికెన్ స్కిన్ తో 200రూపాయలు, స్కిన్ లెస్ చికెన్ 230రూపాయలుగా విక్రయిస్తున్నారు. అయితే ఈసారి అధిక శ్రావణమాసం రావడంతో మరో రెండు మూడు నెలలపాటు ఇవే ధరలు కొనసాగే అవకాశం ఉందని చికెన్ షాప్ ల యజమానులు చెబుతున్నారు.
ఇక ప్రస్తుతం తగ్గిన ధరలతో చికెన్ ప్రియులు పండుగ చేసుకోవచ్చు. ఇష్టమైన రకరకాల చికెన్ వంటలతో పాటు, చికెన్ పచ్చళ్ళు కూడా పెట్టుకొని ఆహా ఏమి రుచి అంటూ కడుపారా ఆరగించవచ్చు. మొన్నటివరకు బాధ పడినట్టు అహ నా పెళ్ళంట సినిమాలో కోడిని వేలాడగట్టుకొని చూస్తూ అన్నాన్ని తినాల్సిన అవసరం లేదు. భారీగా తగ్గిన ధరలతో చికెన్ ప్రియులు ఇష్టమైన చికెన్ ను ఇప్పుడు ఎంతైనా తెచ్చుకొని వండుకుని తినొచ్చు.












Click it and Unblock the Notifications