YS Jagan: ఇక గ్రామనిద్ర: రాష్ట్రాభివృద్ధికి సూచనలు: ఎమ్మెల్యేలు..అధికారులు రెండు కళ్లు: జగన్.. !
విజయవాడ: రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చడానికి అవసరమైన సూచనలు, సలహాలను అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీనియర్ ఐఎఎస్, ఐపీఎస్ అధికారులకు సూచించారు. చిట్టచివరి వ్యక్తి వరకూ అభివృద్ధి, సంక్షేమ ఫలితాలు అందేలా గ్రామ స్థాయి వరకూ పాలనా యంత్రాంగాన్ని కట్టుదిట్టం చేయాలని అన్నారు. సుపరిపాలన అందించడంలో భాగంగా ఇప్పటిదాకా గ్రామ సచివాలయాలు, గ్రామ వలంటీర్లను ఏర్పాటు చేశామని చెప్పారు.

విప్లవాత్మక నిర్ణయాలను తీసుకోండి..
ప్రజలకు మేలు చేయడానికి అవసరమైన కీలక నిర్ణయాలను తీసుకోవడంలో విప్లవాత్మక నిర్ణయాలను తీసుకోవాలని, ఈ విషయంలో తాను పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నానని వైఎస్ జగన్ అన్నారు. గ్రామ సచివాలయాలు, గ్రామ వలంటీర్ల వ్యవస్థ ఆ రకంగా రూపుదిద్దుకున్నదేనని చెప్పారు. ఈ రెండూ అద్భుత ఫలితాలను ఇస్తున్నాయని అన్నారు. గ్రామీణ ప్రజలకు సంక్షేమ పథకాలను లబ్దిని అందినప్పుడే వాటికి సార్థకత ఏర్పడుతుందని చెప్పారు.

ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా..
ఒకప్పుడు ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే వారని, ఇప్పుడు ప్రభుత్వ సిబ్బందే.. ప్రజల ఇంటి గుమ్మం వద్దకు వెళ్తున్నారని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు చెప్పారు. గ్రామ సచివాలయాలు, గ్రామ వలంటీర్ల వ్యవస్థను ప్రవేశ పెట్టిన తరువాత.. గ్రామ స్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టిందని కలెక్టర్లు వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు.

రాత్రనకా, పగలనకా అధికారులను ఇబ్బంది పెట్టొద్దు..
జిల్లా స్థాయి పాలనా యంత్రాంగాన్ని ఇబ్బందులకు గురి చేస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని వైఎస్ జగన్ అన్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యేలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాత్రనకా, పగలనకా అధికారులకు ఫోన్లు చేస్తూ ఇబ్బందులకు గురి చేయొద్దని ఆయన పార్టీ ఎమ్మెల్యేలకు హితబోధ చేశారు. అధికార యంత్రాంగంపై ఒత్తిడిని తీసుకొచ్చి, వారిని ఉరుకులు, పరుగులు పెట్టించిన సాధించబోయేదేమీ ఉండదని అన్నారు. అక్రమాలకు పాల్పడిన వారు అధికార పార్టీ నాయకులైనప్పటికీ.. వదిలి పెట్టొద్దని వైఎస్ జగన్ అధికారులకు సూచించారు.

ఎమ్మెల్యేలు కూడా గ్రామనిద్ర..
జనవరి మూడో వారం నుంచి ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గాల పరిధిలో వారంలో రెండు రోజుల పాటు ఒక్కో గ్రామంలో పర్యటించాలని, వీలైతే అక్కడే నిద్రించాలని అన్నారు. గ్రామాలకు మౌలిక సదుపాయాల కల్పన, విద్య, వైద్యం.. వంటి ప్రాథమిక అవసరాలపై దృష్టి సారించాలని చెప్పారు. సంక్షేమ వసతిగృహాల పనితీరును పరిశీలించాలని అన్నారు. వారంలో రెండు రోజుల పాటు గ్రామాల్లో పర్యటించిన అనంతరం.. అక్కడి స్థితిగతులపై తనకు ఓ నివేదికను సైతం అందజేయాలని చెప్పారు.

విందు ఏర్పాట్లు ఇలా..
విజయవాడలోని బరం పార్క్ లో రాత్రి 8 గంటలకు విందు ఏర్పాటైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లు దీనికి హాజరయ్యారు. జిల్లాకు ఒకటి చొప్పున 13 జిల్లాలకు వేర్వేరుగా డైనింగ్ టేబుళ్లు వేశారు. ఒక్కో టేబుల్ వద్ద ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీలు కూర్చున్నారు. వైఎస్ జగన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ, డీజీపీ గౌతమ్ సవాంగ్, అజేయ కల్లం ప్రతి టేబుల్ వద్దకు వెళ్లి, వారితో చర్చించారు.












Click it and Unblock the Notifications