జనసైనికులకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్ట్రాంగ్ వార్నింగ్!
దెందులూరు నియోజకవర్గంలో జనసేన, టిడిపి శ్రేణుల మధ్య ఘర్షణలు చిలికి చిలికి గాలి వానగా మారుతున్నాయి. తాజాగా పైడిచింతలపాడు గ్రామంలో టిడిపి, జనసేన వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ పైన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. ఘర్షణకు పాల్పడిన వారికి ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
చింతమనేని ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు
ఏలూరు జిల్లాలో జనసేన టిడిపి వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణలపైన మాట్లాడిన చింతమనేని ప్రభాకర్ ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన పార్టీలోకి వచ్చిన వారి కారణంగా గొడవలు జరుగుతున్నాయని వ్యాఖ్యలు చేశారు. ఇక తాజాగా ఘర్షణలో గాయపడ్డ వారిని పరామర్శించిన చింతమనేని ప్రభాకర్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

గతంలో కూటమి ఓటమికి ప్రయత్నించిన వాళ్లే
కొంతమంది ఆధిపత్యం కోసం ఘర్షణలకు దిగుతున్నారని మండిపడ్డారు. కొన్ని అరాచక శక్తులు ఇటీవల జనసేన పార్టీలో చేరాయని, కేవలం పబ్బం గడుపుకోడానికే వారు జనసేన పార్టీలో చేరినట్టు ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో కూటమి ఓటమికి ప్రయత్నించిన వాళ్లే ఇప్పుడు జనసేన పార్టీలో చేరారని అన్నారు.
పార్టీలో చేరి అధికారం చెలాయిస్తాం అంటే కుదరదు
అధికారం చెలాయించటం కోసం ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గ్రామాలలో గొడవలు పెట్టే సంస్కృతి మానుకోవాలని హితవు పలికారు. ఇప్పుడు పార్టీలో చేరి అధికారం చెలాయిస్తాం అంటే కుదరదని పేర్కొన్న చింతమనేని ప్రభాకర్ ఈ వ్యవహారం పైన జనసేన అధినాయకత్వంతో మాట్లాడుతామని తేల్చి చెప్పారు. జనసేన పార్టీలో ఇటీవల కొత్తగా చేరి హంగామా చేస్తున్న వారికి చింతమనేని ప్రభాకర్ మాస్ వార్నింగ్ ఇచ్చారు.
పించన్ల పంపిణీ విషయంలో టీడీపీ వర్సెస్ జనసేన
ఇదిలా ఉంటే దెందులూరు నియోజకవర్గం పైడి చింతలపాడు గ్రామంలో నిన్న పింఛన్ల పంపిణీ విషయంలో తలెత్తిన ఘర్షణ జనసేన టిడిపి కార్యకర్తలు బాహబాహికి దిగేంతగా చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో ఇరు పార్టీల వారు గాయపడగా ఒక పార్టీ వారు ఏలూరులోనూ, మరో పార్టీ బాధితులు విజయవాడలోని చికిత్స పొందుతున్నారు.
అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమైన టీడీపీ, జనసేన
అయితే ఈ ఘటన పైన అటు టిడిపి ఇటు జనసేన నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇక జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేయాలని రెడీ అవ్వగా, టిడిపి శ్రేణులు కూడా ఈ విషయంలో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. దీంతో ఈ వ్యవహారంలో ఏం జరగబోతుంది అన్నది రాజకీయ వర్గాలలోనూ, ప్రజలలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది.












Click it and Unblock the Notifications