కమ్మ కులస్తులకు నా క్షమాపణలు!
కమ్మ సామాజికవర్గంపై తాను చేసిన వ్యాఖ్యలకు చీరాల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు ఆమంచి కృష్ణమోహన్ క్షమాపణలు చెప్పారు. దీనికి సంబంధించిన ఒక వీడియోను ఆయన విడుదల చేశారు. ఇటీవల ఆయన కమ్మ సామాజికవర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాటిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం కావడంతో తాజాగా ఆయన క్షమాపణలు కోరారు.
ఈ సందర్భంగా ఆమంచి మాట్లాడుతూ వేటపాలెం ఘటనలో తాను చేసిన వ్యాఖ్యలు కమ్మ సామాజికవర్గంలో కుల రహితంగా బతికేవారిని, తన శ్రేయోభిలాషును, స్నేహితులను బాధించాయని, ఈ నేపథ్యంలో అందరినీ మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నానని, తాను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానన్నారు. ఘటనకు కారణమైన వ్యక్తులకు మాత్రం తన క్షమాపణలు వర్తించవని స్పష్టం చేశారు.

చీరాల వైసీపీలో ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గాల మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోంది. రెండు రోజుల క్రితం వేటపాలెం పరిధిలోని రామన్నపేట పంచాయితీ 6, 10 వార్డులకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు ఆమంచి వర్గీయులు నామినేషన్లు వేయడానికి ప్రయత్నించగా కరణం బలరాం వర్గీయులు అడ్డుకున్నారు.
దీంతో ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరాం తనయుడు వెంకటేష్ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఇరు నేతలు అక్కడకు చేరుకోవడంతో వారి అనుచరులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. వివాదం పెద్దదయ్యే అవకాశం ఉండటంతో పోలీసులు ఇరువైపులా శాంతింపచేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే వివాదాస్పద వ్యాఖ్యలు వచ్చాయి. ఆమంచి కష్ణమోమన్ సోదరుడు స్వాములు ప్రెస్ మీట్ పెట్టి వెంకటేష్ పై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications