జనసేనకే చిరంజీవి మద్దతు; భారీ విరాళంతో పవన్ కళ్యాణ్ కు బాసటగా మెగాస్టార్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నాయి. ప్రచార పర్వాన్ని జోరుగా కొనసాగిస్తున్నాయి. ఈసారి ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకం కావడంతో ఎవరికి వారు తమదైన పంధాలో దూకుడును కొనసాగిస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ, ఈసారి ఎన్నికలలో విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టిడిపి, బిజెపితో కలిసి పొత్తులతో కూటమిగా ఎన్నికల బరిలోకి వెళుతున్నారు.
పవన్ కళ్యాణ్ కు బాసటగా చిరంజీవి
ఈ క్రమంలో జనసేన ఎన్నికల ఆర్థిక అవసరాల కోసం నేనున్నానంటూ మెగాస్టార్ చిరంజీవి బాసటగా నిలిచారు. జనసేన విజయాన్ని కాంక్షిస్తూ మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ కు భారీ విరాళాన్ని ప్రకటించారు. నీ వెనుక నేనున్నానంటూ చిరంజీవి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు, నాగబాబు కు తాను బాసటగా ఉన్నానని స్పష్టం చేశారు.

చిరంజీవిని కలిసిన పవన్ కళ్యాణ్
నేడు హైదరాబాద్ నగర శివారులోని ముచ్చింతల్ లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర షూటింగ్ లోకేషన్ కు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఇద్దరూ వెళ్లి అక్కడ చిరంజీవిని కలిశారు. ఇద్దరు సోదరులను ఆత్మీయ ఆలింగనం తో ఆహ్వానించిన చిరంజీవి వారితో కొద్దిసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఏపీలో ఎన్నికల పరిస్థితిని చిరంజీవికి వివరించినట్టు సమాచారం.
జనసేనానికి శ్రీ చిరంజీవి గారి ఆశీర్వాదాలు... జనసేనకు రూ.ఐదు కోట్ల విరాళం @KChiruTweets @PawanKalyan pic.twitter.com/4DZ9XLJ9aT
— JanaSena Party (@JanaSenaParty) April 8, 2024
సోదరుల భావోద్వేగం .. భారీ విరాళం ఇచ్చిన చిరంజీవి
చిరంజీవి పాదాలకు నమస్కరించిన పవన్ కళ్యాణ్ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్, చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు. జనసేన పార్టీ కోసం ఐదు కోట్ల రూపాయల భారీ విరాళాన్ని మెగాస్టార్ చిరంజీవి వారికి అందించి అండగా ఉంటానని చెప్పారు.
తన మద్దతు జనసేనకే అంటున్న చిరంజీవి
పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న క్రమంలో, ఈసారి కచ్చితంగా విజయం సాధిస్తాడని, అలాగే మిగతా అన్ని స్థానాల్లోనూ జనసేన నుంచి పోటీ చేసిన అభ్యర్థులు గెలవాలని తాను కోరుకుంటున్నానని మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ కు చెప్పినట్టు సమాచారం. ఏది ఏమైనా తన సోదరుడు పవన్ కళ్యాణ్ పైన విపరీతమైన ప్రేమను కురిపించే చిరంజీవి, 5 కోట్ల రూపాయల చెక్ ఇచ్చి తన మద్దతు తన సోదరుడికే అని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications