విశాఖపట్నంలో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు భారీ ఏర్పాట్లు!
విశాఖపట్నం నగరం ఒకసారి మరోసారి అంతర్జాతీయ వేదికగా మారనుంది. ఈ నెల 12, 13 తేదీల్లో జరగనున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు కోసం ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అతిథులు మెచ్చేలా ప్రతి వివరాన్ని పరిగణనలోకి తీసుకుని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.ఈ సదస్సు ట్రేడ్, టెక్నాలజీ, ట్రస్ట్' అనే థీమ్‌తో జరుగుతోంది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకరోజు ముందే విశాఖ చేరుకోనున్నారు. మొదటి రోజు ఉదయం 9.30 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, సీఎం చంద్రబాబు, రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ తదితరులు సదస్సును ప్రారంభించనున్నారు. ముగింపు ఉత్సవాల్లో భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ పాల్గొననున్నారు.

సుమారు 58 నుంచి 59 దేశాల నుంచి ప్రతినిధులు రానున్నారు. వీరిలో 15 నుంచి 16 మంది విదేశీ మంత్రులు, 40 మందికి పైగా అంతర్జాతీయ స్థాయి ప్రతినిధులు ఉన్నారు. మొత్తం 350 మంది విదేశీ ప్రతినిధులు, 900 మంది భారతీయ ప్రతినిధులతో కలిపి దాదాపు 1,250 మంది పాల్గొననున్నారు. సింగపూర్, నేపాల్, కంబోడియా, మయన్మార్, యుఎఈ, కెనడా, మారిషస్, ఈజిప్ట్, అల్జీరియా, టాంజానియా, గ్వాటెమాలా వంటి దేశాల ప్రభుత్వ ప్రతినిధులు హాజరు కానున్నారు.
వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్ ప్రతినిధులు కూడా పాల్గొననున్నారు. అతిథుల సౌకర్యాల కోసం నగరంలోని 26 హోటళ్లలో 580కి పైగా గదులను సిద్ధం చేశారు. సదస్సు వేదిక వద్ద రిజిస్ట్రేషన్ బ్లాక్, పార్కింగ్, ల్యాండ్‌స్కేపింగ్, ఫౌంటెన్లు, సూచిక బోర్డులు, విద్యుత్ ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి.
నవంబర్ 11న ప్రాథమిక పరిశ్రమల సమావేశాలు, సాయంత్రం సీఎం ఆతిథ్యంలో డిన్నర్ ఉంటుంది.ఈ సదస్సులో ఆరు ప్రధాన అంశాలపై చర్చలు జరుగుతాయి. వాణిజ్యం, పెట్టుబడులు, గ్లోబల్ వాల్యూ చైన్స్, జియోఎకనామిక్స్, అంతర్జాతీయ సహకారం, వ్యవసాయం, ఆహార భద్రత, బయో-బేస్డ్ ఎకానమీ, నైపుణ్యాలు, అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు, టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఫ్యూచర్ ఇండస్ట్రీస్, క్లీన్ ఎనర్జీ, సస్టైనబుల్ గ్రోత్, క్వాంటం టెక్నాలజీ, సెమీకండక్టర్లు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి ఉంటుంది.
దాదాపు 400 బీ2బీ బిజినెస్ టు బిజినెస్ సమావేశాలు, బీ2జీ బిజినెస్ టు గవర్నమెంట్ సమావేశాలు ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు ఈ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పెట్టుబడులు, వాణిజ్యం, సాంకేతిక భాగస్వామ్యాలకు ప్రధాన కేంద్రంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే ప్రాంతీయ సమావేశాల ద్వారా రూ.86,522 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయి.
ఇవి 1.47 లక్షల మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే రూ.6 లక్షల కోట్ల విలువైన 272 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. మరో రూ.17 లక్షల కోట్ల ప్రాజెక్టులకు అనుమతులు లభించాయి. సమాంతరంగా ఏపీ ఉమెన్ అండ్ గ్రోత్ సమ్మిట్ 2026 కూడా నిర్వహిస్తున్నారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రం యొక్క పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి చూపించి, కొత్త భాగస్వామ్యాలు ఏర్పరచుకోవాలని ప్రభుత్వం ఆశిస్తోంది. విశాఖపట్నం ఇప్పటికే పోర్ట్ సిటీగా, ఇండస్ట్రియల్ హబ్‌గా ఎదుగుతున్న నేపథ్యంలో ఈ సదస్సు మరింత ప్రాధాన్యత సంతరించుకుంటోంది.













Click it and Unblock the Notifications
