చంద్రబాబు అరెస్ట్ మీకు తెలియకుండానా?: మోడీకి కేఎస్ రామారావు, రాష్ట్రపతి పాలనకు డిమాండ్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత, చంద్రబాబు నాయుడు అరెస్టుపై ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు ప్రధాని నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు ప్రశ్నలు సంధించారు. మీకు తెలియకుండానే చంద్రబాబును జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేయించిందా? అని ప్రశ్నించారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయించాలని కోరారు.
ఆ లేఖలో.. 'మీరు జీ20 సదస్సులో హడావుడిగా ఉన్నప్పుడు.. సీఎం జగన్ లండన్‌లో ఉన్నప్పుడు ఈ అరెస్ట్ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో విచ్చలవిడిగా సాగుతున్న రాజకీయ కక్షలు, స్కాములు, అక్రమ కేసులు, అభద్రతాభావం, దిగజారుతున్న శాంతిభద్రతలు.. ఇవన్నీ చూసి రాష్ట్ర ప్రజల తరపున బాధతో.. బాధ్యతతో అడుగుతున్నా. చంద్రబాబును నిరాధార ఆరోపణలతో జైల్లో పెట్టడం చూసి నా హృదయం రగిలిపోయింది' అని కేఎస్ రామారావు పేర్కొన్నారు.

తనకు ఏ రాజకీయ పార్టీతో సంబందం లేదని.. కానీ, రాష్ట్ర పౌరుడిగా, భారత పౌరుడిగా ఏపీలో ప్రస్తుత పరిస్థితుల్ని చూసి బాగా విసిగిపోయినట్లు తెలిపారు. రాజధాని లేని రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక.. భావితరాల కోసం రాజధానిగా అమరావతిని ప్రకటించారు. శంకుస్థాపనకు మీరూ(ప్రధాని మోడీ) వచ్చారు అని రామారావు గుర్తు చేశారు. ఆ తర్వాత 16 నెలలు జైల్లో గడిపి, ఆర్థిక మోసాల కేసులో నిందితుడిగా ఉన్న జగన్ అధికారంలోకి వచ్చాక ముందుగా.. ప్రజావేదిక కూల్చివేతతో తన విధ్వంసక పాలన మొదలుపెట్టారని అన్నారు.
అమరావతిని రాజధానిగా ఉండనివ్వకూడదని అనుకున్నారు. మీరు(మోడీ) శంకుస్థాపన చేసిన రాజధాని విషయంలో అలా చేయొద్దని జగన్‌ను హెచ్చరించాల్సింది. దేశంలో ఐటీ రంగానికి ప్రాధాన్యం ఇచ్చిన చంద్రబాబు వల్లే ఇప్పుడు లక్షల మంది ఉద్యోగులు ప్రపంచ వ్యాప్తంగా మంచి జీవితాలు అనుభవిస్తున్నారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న ఐటీ ఉద్యోగులను చంద్రబాబు అరెస్ట్ వార్త కుదిపేసింది. రోడ్ల మీదకు వచ్చి వారు తెలిపిన నిరసనను.. ప్రధానమంత్రిగా మీరు గమనించి ఉండాలని కేఎస్ రామారావు పేర్కొన్నారు.
నేషనల్ ఫ్రంట్‌కు ఎన్టీ రామారావు ఛైర్మన్‌గా ఉన్నప్పుడు బీజేపీ అధికారంలోకి రావడానికి చంద్రబాబు ఎంతో కృషి చేశారని రామారావు చెప్పారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతను జైల్లో ఇబ్బందులు పెడుతుంటే.. తెలుగు ప్రజల హృదయాల్లో రగులుతున్న బడబాగ్నిని మీరు గమనించండి. ఇప్పటికైనా చంద్రబాబును జైలు నుంచి విడుదల చేయించండి అని కేఎస్ రామారావు ప్రధానిని కోరారు.
అంతేగాక, ప్రధానమంత్రిగా మీకున్న అధికారంతో జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేయండి. రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు జరిగేవరకూ రాష్ట్రపతి పాలన విధించండి. ఆ చర్యతో తెలుగు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. తక్షణం స్పందించి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించండి అని తన లేఖలో ప్రధాని మోడీని కేఎస్ రామారావు కోరారు. కాగా, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రలో జైలులో ఉన్నారు.












Click it and Unblock the Notifications