పదో తరగతి విద్యార్థిని అనుమానాస్పద మృతి: అసలేం జరిగింది?
అచ్యుతాపురం కస్తూరిబా గాంధీ బాలికా విశ్వవిద్యాలయంలో పదో తరగతి చదువుతున్న రొంగలి వెంకటలక్ష్మి ఆదివారం తెల్లవారుజామున ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
అచ్యుతాపురం: అచ్యుతాపురం కస్తూరిబా గాంధీ బాలికా విశ్వవిద్యాలయంలో పదో తరగతి చదువుతున్న రొంగలి వెంకటలక్ష్మి ఆదివారం తెల్లవారుజామున ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్వయంగా ఘటనా స్థలికి వచ్చి పరిశీలించారు. అయినా ఇందుకు దారితీసిన కారణాలపై ఇంతవరకు స్పష్టత రాలేదు.
కశింకోట మండలం అడ్డాం గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి అచ్యుతాపురం కస్తూరిబా గాంధీ బాలికా విశ్వవిద్యాలయంలో ఆరో తరగతిలో చేరింది. ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. రోజూ మాదిరిగానే ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు నిద్ర లేచింది.
కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత స్నేహితురాలు ఉష వద్ద సాంఘిక శాస్త్రం గైడ్ తీసుకుని సహ విద్యార్థులతో కలిసి తరగతి గదిలోకి వెళ్ళింది. కొద్దిసేపటి తరువాత సహ విద్యార్దినిలు ఇద్దరూ కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటికి వెళ్ళారు.
వారు తిరిగి వచ్చేసరికి తరగతి గదిలోని ఫ్యాను రెక్క చివర భాగానికి చున్నీలో వెంకటలక్ష్మి వేలాడుతూ కనిపించింది. భయాందోళనకు గురైన విద్యార్థినులు గట్టిగా కేకలు వేయడంతో సిబ్బంది వచ్చి చూసి, ఇంకా ప్రాణం ఉందేమో అనే ఆలోచనతో వెంకట లక్ష్మిని కిందకు దించి చూశారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందింది.

దీంతో పాఠశాల ప్రత్యేకాధికారిణి భారతి వెంటనే రాజీవ్ విద్యామిషన్ అధికారులకు సమాచారం అందించారు. రాంబిల్లి ఎస్సై కుమారస్వామి ఘటనా స్థలానికి చేరుకుని బాలిక మృతిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పంచనామా అనంతరం వెంకటలక్ష్మి మృతదేహాన్ని ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, పోస్టుమార్టం అనంతరం ఆమె బంధువులకు అప్పగించారు.
దర్యాప్తునకు ఆదేశం
కస్తూరిబా గాంధీ బాలికా విశ్వవిద్యాలయంలో బాలిక ఆత్మహత్య చేసుకుందన్న సమాచారం తెలియగానే రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు , అనకాపల్లి ఎంపీ శ్రీనివాసరావు, గాజువాక, పాయకరావుపేట ఎమ్మెల్యేలు అనిత, పల్లా శ్రీనివాస్ పాఠశాలకు చేరుకుని విద్యార్థిని మృతదేహాన్ని, తరగతి గదిని, సీలింగ్ ఫ్యాన్ ను పరిశీలించారు.
ఉదయం పూట వెంకటలక్ష్మితో ఉన్న ఇతర విద్యార్థినులను, ఆమె స్నేహితురాళ్ళతో మాట్లాడారు. పాఠశాల సిబ్బందిని కూడా పలు విషయాలపై ప్రశ్నించారు. వెంకటలక్ష్మి తండ్రి, అన్నయ్యలతో కూడా మాట్లాడారు.
ఎమ్మెల్యే అనిత, ఎంపీ ముత్తంశెట్టి కూడా పలువురు విద్యార్థినులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ ఘటనపై మరింత దర్యాప్తు నిర్వహించి బాధ్యులను విధుల నుంచి తొలగించాలని రాజీవ్ విద్యా మిషన్ ప్రాజెక్టు అధికారి శివరామ ప్రసాదును మంత్రి గంటా ఆదేశించారు.
మంత్రి వాహనం ఎదుట ఆందోళన
పాఠశాలలో పరిశీలన అనంతరం మంత్రి గంటా శ్రీనివాసరావు తిరిగి వెళుతుండగా విద్యార్థిని వెంకట లక్ష్మి కుటుంబ సభ్యులు, ఎస్ఎఫ్ఐ, సీపీఎం నాయకులు అడ్డుకున్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలో చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందితే.. సంబంధిత మంత్రి ఎటువంటి చర్యలు తీసుకోకుండా, పూర్తిస్థాయి విచారణకు ఆదేశించకుండా వెళ్ళిపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
బాధిత కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని నినాదాలు చేశారు. అయినప్పటికీ మంత్రి గంటా ఎలాంటి సమాధానం చెప్పకుండా వెళ్లేందుకు ప్రయత్నించడంతో వారు ఆగ్రహించి కాన్వాయ్ ను అడ్డుకున్నారు.
మహిళలు సైతం కారు ఎదుట భోరున విలపిస్తూ న్యాయం చేయాలని అడ్డగించారు. దాదాపు అరగంటకు పైగా ఇది సాగడంతో ఒకదశలో మంత్రి గంటా 'ఇక్కడ డీఎస్పీ ఎవరు?' అంటూ అసహనం వ్యక్తం చేశారు.
ఎట్టకేలకు పోలీసులు అదనపు బలగాలు రప్పించి ఆందోళనకారులను చెదరగొట్టారు. పోలీసులు, తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు సహకారం అందివ్వడంతో మంత్రి గంటా వాహనం అతికష్టం మీద ముందుకు కదిలింది.












Click it and Unblock the Notifications