జమిలి పై చంద్రబాబు బిగ్ ట్విస్ట్ - ఏం జరుగుతోంది..!!
ఏపీ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. వైసీపీ లక్ష్యంగా కూటమి వ్యూహాత్మకంగా వ్యవహరి స్తోంది. కూటమిని ఫిక్స్ చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. ఈ సమయంలోనే జమిలి ఎన్నికల పైన చర్చ జరుగుతోంది. కేంద్రం వేస్తున్నఅడుగులకు అనుగుణంగా 2027లోనే జమిలి ఎన్నికల కు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే, తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు జమిలి ఎన్నికలు.. ఏపీలో పోలింగ్ పైన తేల్చేసారు. ఎన్నికలు ఎప్పుడో క్లారిటీ ఇచ్చారు.
జమిలి పై కసరత్తు
కేంద్ర ప్రభుత్వం కొంత కాలంగా జమిలి ఎన్నికల పైన కసరత్తు చేస్తోంది. ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లు సైతం ప్రవేశ పెడతారనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతోనూ ప్రధాని మోదీ ప్రత్యేకంగా జమిలి అంశం పైన చర్చించారు. హర్యానా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం తరువాత జరిగిన ఎన్డీఏ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు ఆ వెంటనే జమిలికి మద్దతుగా వ్యాఖ్యలు చేసారు. జమిలికి తాము పూర్తిగా సహకరిస్తామని వెల్లడించారు. ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలను గమినిస్తున్న వైసీపీ సైతం జమిలి ఖాయం అయితే 2027లోనే ఎన్నికలు జరుగుతాయనే అంచనాతో ఉంది.

2029లోనే ఎన్నికలు
ఇక, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు జమిలి పైన కీలక వ్యాఖ్యలు చేసారు. మీడియాతో ఇష్ఠాగోష్టిలో చంద్రబాబు జమిలి పైన స్పందించారు. దేశంలో జమిలి వచ్చినా రాష్ట్రంలో మాత్రం షెడ్యూల్ ప్రకారం 2029లోనే ఎన్నికలు ఉంటాయని చంద్రబాబు స్పష్టం చేసారు. ముందస్తు ఉండవని తేల్చి చెప్పారు. అయితే, జమిలి నిర్వహణ పైన కేంద్రం ఆలోచన ఏంటనేది ఈ పార్లమెంట్ సమావేశాల్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. జమిలి ముందే జనగణన, నియోజకవర్గాల పునర్విభజన పూర్తి చేయాల్సి ఉంది. దీంతో, 2029కే కేంద్రం జమిలి నిర్వహణ కు మొగ్గు చూపుతుందా.. లేక, ముందుగానే దేశ వ్యాప్తంగా జమిలి దిశగా నిర్ణయం తీసుకుంటుందా అనేది స్పష్టత రావాల్సి ఉంది.
ఏపీలో ఎన్నికలపై
అయితే, చంద్రబాబు ఏపీలో మాత్రం 2029 లోనే ఎన్నికలు ఉంటాయని చెప్పటం పైన రాజ కీయంగా చర్చ మొదలైంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే కేంద్రం తీసుకురానున్న వక్ఫ్ బిల్లుపై పార్టీ ఎంపీలకు చంద్రబాబు కీలక సూచనలు చేసారు. ముస్లిం వర్గాల మనోభావాలను తాను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పెద్దలకు వివరించానని చెప్పారు. వాళ్లు కూడా తొందరపడే ఉద్దేశంలో లేరనే అనుకుంటున్నానని వ్యాఖ్యానించారు. ఒకవేళ బిల్లు పార్లమెంటు ముందుకు వస్తే ఏం చేయాలో అప్పుడు ఆలోచించుకుందామని చెప్పుకొచ్చారు. ఎన్డీఏలో కీలక పక్షంగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలతో జమిలి పైన మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది.












Click it and Unblock the Notifications