స్థానిక ఎన్నికల్లో బీసీలకు సీట్ల కేటాయింపు పై చంద్రబాబు అనూహ్య నిర్ణయం..!!
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్దం అవుతోంది. ప్రభుత్వం - ఎన్నికల సంఘం ఈ ఎన్నికల పైన కసరత్తు చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలు పైనా చర్చ జరుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం నియమించిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ బీసీలకు రిజర్వేషన్ల పైన నివేదిక సమర్పించింది. దీంతో... బీసీలకు సీట్ల కేటాయింపు పైన పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. అసెంబ్లీ వేదికగా నిర్ణయం ప్రకటించనున్నారు.
ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణకు కసరత్తు వేగంగా కొనసాగుతోంది. సర్ ప్రక్రియ పూర్తయిన తరువాత ఈ ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. 2025 ఎన్నికల జాబితా మేరకు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇదే సమయంలో బీసీ రిజర్వేషన్ల అంశం పైన ప్రభుత్వానికి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదిక సమర్పించింది. ఈ నివేదికను రేపు (సోమవారం) ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్నారు. రిజర్వేషన్ల అమలు పైన బిల్లు- తీర్మానం దిశగా ఆలోచన చేస్తున్నారు. ఇదే సమయంలో బీసీలకు సీట్ల కేటాయింపు పైన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం సీట్లు ఇస్తామన్న హామీని నిలబెట్టుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు.

చంద్రబాబు కీలక నిర్ణయం
సీఎం చంద్రబాబు కూటమి పార్టీల నేతలతో టెలి కాన్ఫిరెన్స్ నిర్వహించారు. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ సిఫారసులను అమలు చేస్తే బీసీలకు 27 శాతం మాత్రమే రిజర్వేషన్లు కల్పించగలమని చెప్పారు. కానీ, ఎన్నికల సమయంలో 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చామని గుర్తు చేశారు. దీని అమలుకు ఉన్న అవకాశాలను పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయ పరమైన చిక్కులు ఎదురయ్యేపక్షంలో బీసీలకు పార్టీపరంగా న్యాయం చేద్దామని పేర్కొన్నారు. వారికి రాజకీయంగా సముచితస్థానం కల్పిద్దామని సీఎం స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో.. ఎల్‌నినో, వ్యవసాయం, నీటిపారుదల, శాంతిభద్రతలు, వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్-1పై సిట్ నివేదిక వంటి అంశాలతోపాటు మరిన్ని అంశాలపై చర్చించాలని భావించారు. 18న జరిగే మంత్రివర్గ సమావేశంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన వివిధ బిల్లుల ఆమోదంపై చర్చిద్దామని సీఎం చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications