స్థానిక ఎన్నికల్లో జగన్ హిట్ అండ్ రన్ థియరీపై భగ్గుమన్న సీఎం చంద్రబాబు
స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి హిట్ అండ్ రన్ థియరీపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైర్ అయ్యారు. క్రిమినల్ లిటిగెంట్ గా వ్యవహరిస్తున్న జగన్ తీరును సీఎం చంద్రబాబు ఎండగట్టారు.స్థానిక ఎన్నికలను అడ్డుకునేందుకు వైసీపీ ప్రొత్సహించిన హింసాత్మక ఘటనల వీడియోలు ప్రదర్శించిన సీఎం చంద్రబాబు ఎన్నికలను వైసీపీ అడ్డుకుంటోంది అన్నారు. అదే హింస... అవే అబద్దాలు... అవే అరాచకాలు... పేరుతో వైసీపీ హింసా రాజకీయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు బుక్ లెట్ విడుదల చేశారు.
మంచి పాలనతోనే సుపరిపాలన అనేది సాధ్యం అని, ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కీలకమైన ప్రక్రియ. స్వయంప్రతిపత్తి కలిగిన ఎన్నికల వ్యవస్థ మనకు ఉందని పేర్కొన్న చంద్రబాబు గత పాలనలో శాంతిభద్రతలు తీవ్రస్థాయిలో దెబ్బతిన్నాయన్నారు. ఏపీలో ఓ రాజకీయ పార్టీ నుంచి శాంతిభద్రతల సమస్యలు తలెత్తటం తీవ్రమైన అంశం అని ఆయన అభిప్రాయపడ్డారు.
గతంలో నక్సల్స్ శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగించే పరిస్థితి ఉంటే, రాయలసీమ ప్రాంతంలో ఫ్యాక్షన్ గొడవలు రాష్ట్రాభివృద్ధికి తీవ్ర నష్టం కలిగించాయన్నారు.

రాష్ట్రంలో రౌడీయిజాన్ని కూడా కట్టడి చేసి శాంతిభద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని చంద్రబాబు పేర్కొన్నారు. వైఎస్ హయాంలో ఫ్యాక్షన్ తో భయపడిన పరిస్థితి ఉన్నదని,2014 తర్వాత ఓ పార్టీ నానా అరాచకం సృష్టించిందన్నారు. ఎన్నికలను అపహాస్యం చేసి, పాలనను విధ్వంసం చేశారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.ఆఖరుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కూడా తనకు ప్రాణ భయం ఉందని ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉందని చంద్రబాబు అన్నారు.
2024లో దానికి ఫలితంగా కూటమి ప్రభుత్వం రికార్డు స్థాయిలో ప్రజల మద్దతు సాధించిందని, 94 శాతం మేర స్ట్రైక్ రేట్ తో 57 శాతం ఓట్లను సాధించగలిగామని చంద్రబాబు పేర్కొన్నారు.
ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసేలా అనునిత్యం పనిచేస్తూ వస్తున్నామని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనపై దృష్టి పెట్టి కోల్పోయిన బ్రాండ్ ను పునరుద్ధరించామన్నారు.
రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీ బ్రాండ్ తోనే సాధించగలిగామన్నారు. వేగంగా అనుమతులు ఇస్తే ఎక్కువ పరిశ్రమలు వస్తాయి, ఎక్కువ మందికి ఉద్యోగాల కల్పన జరుగుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కేవలం ఒప్పందాలే కాదు ఉత్పత్తి దశకు వెళ్లేంత వరకూ ఫాలో అప్ చేస్తున్నామన్నారు. ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయని పొరుగు రాష్ట్రాలతో సహా యావత్ దేశం గుర్తించిందని చంద్రబాబు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications
