ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి చంద్రబాబు హెచ్చరిక
Chandrababu: కడప జిల్లా బద్వేలు సమీపంలోని గోపవరంలో అత్యాచారానికి గురైన ఇంటర్మీడియట్ విద్యార్థిని మరణించింది. కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ ఈ తెల్లవారు జామున మృతి చెందింది. ఆమెను కాపాడటానికి డాక్టర్లు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. అత్యాధునిక చికిత్స అందించినప్పటికీ ఫలితం దక్కలేదు.
బాధితురాలు బద్వేలులో ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన విఘ్నేష్ ప్రేమ పేరుతో తరచూ ఆమెను వేధిస్తుండేవాడు. ఆమె తిరస్కించడంతో గోపవరం అటవీ ప్రాంతంలో బాధితురాలిపై దాడికి పాల్పడ్డాడు. పెట్రోల్ పోసి, నిప్పంటించి పరారయ్యాడు.

మంటల బారిన పడ్డ బాధితురాలిని స్థానికులు కాపాడారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. చికిత్స నిమిత్తం బద్వేలు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే 80 శాతం శరీరం కాలిపోవడం వల్ల మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున బాధితురాలు మృతి చెందారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఈ కేసును స్వయంగా పర్యవేక్షించారు. శనివారం రాత్రే పోలీసుల విఘ్నేష్‌ను అరెస్ట్ చేశారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో తీవ్రంగా గాయడిన ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకరమని అన్నారు. ఈ ఘటన తనను ఎంతగానో కలచివేసిందని చెప్పారు.
కడప జిల్లా బద్వేల్ లో యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో తీవ్రంగా గాయడిన ఇంటర్ విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకరం. ఈ ఘటన నన్ను ఎంతగానో కలచివేసింది. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థిని ఒక దుర్మార్గుడి దుశ్చర్యకు బలి కావడం విచారకరం.…
— N Chandrababu Naidu (@ncbn) October 20, 2024
ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థిని.. ఒక దుర్మార్గుడి దుశ్చర్యకు బలి కావడం విచారకరమని, నిందితుడిని అరెస్టు చేశామని జిల్లా అధికారులు తెలియజేశారని వివరించారు. ఈ కేసులో వేగంగా విచారణ పూర్తి చేసి, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని ఆదేశించినట్లు చంద్రబాబు చెప్పారు.
బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయడం అంటే- హంతకుడిని త్వరగా, చట్టబద్దంగా, కఠినంగా శిక్షించడమేనని తేల్చి చెప్పారు. అందుకే ప్రత్యేక కోర్టులో ఫాస్ట్ ట్రాక్ విధానంలో ఈ కేసు విచారణ పూర్తి చేసి నేరస్తుడికి మరణశిక్ష స్థాయి శిక్ష పడేలా చూడాలని అధికారులను ఆదేశించానని చెప్పారు.
భవిష్యత్తులో రాష్ట్రంలో మహిళలు, ఆడబిడ్డలపై ఎలాంటి అఘాయిత్యాలకైనా పాల్పడే వారికి ఒక హెచ్చరిక చేసేలా బద్వేలు ఘటన నిందితుడికి విధించే శిక్ష తీవ్రత ఉండాలని అధికారులకు సూచించానని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications