కూటమి సర్కార్‌కు 8 నెలలు- ప్రజలు ఎందుకు గెలిపించారో వివరించిన చంద్రబాబు
Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. సంక్షేమం- అభివృద్ధికి అదిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలో ఆదాయ వనరులను పెంచుకోవడం, సంపదను సృష్టించడానికి అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుంటోంది.
ప్రత్యేకంగా సమావేశం..
ఈ క్రమంలో చంద్రబాబు తాజాగా అన్ని మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. మానవ వనరుల అభివృద్ధి మంత్రి నారా లోకేష్, వ్యవసాయ శాఖ మంత్ర కింజరాపు అచ్చెన్నాయుడు సహా అన్ని శాఖల మంత్రులు ఇందులో పాల్గొన్నారు. రోజంతా సాగే సమావేశం ఇది. సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది.

జీఎస్టీ వసూళ్లు, బడ్జెట్ కేటాయింపులు..
రెండు సెషన్లుగా దీన్ని విభజించారు. మొదటి సెషన్‌లో ఫైళ్ల క్లియరెన్స్, నానాటికీ దిగజారుతున్న జీఎస్టీ వసూళ్లను పెంచుకోవడం, ఆదాయ వనరుల గుర్తింపు, నిధుల సమీకరణ.. వంట అంశాలపై మంత్రులు, కార్యదర్శులు చర్చిస్తారు. రెండో సెషన్‌లో కేంద్ర బడ్జెట్, రాష్ట్రానికి జరిగిన కేటాయింపుల అంశాన్ని అజెండాగా చేర్చారు.
ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ..
ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆరంభం కానున్న నేపథ్యంలో- బడ్జెట్ రూపకల్పనపైనా చర్చ ఉంటుంది. మంత్రులు తమ ప్రాధాన్యతల గురించి వివరించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ సందర్భంగా ఆయా శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు.
93 శాతం స్ట్రైక్ రేట్..
ఈ భేటీని ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. రేపటితో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతుందని గుర్తు చేశారు. అయిదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్రం తిరోగమించిందని, అందుకే అప్పటి ప్రభుత్వాన్ని, పరిపాలనను ప్రజలు అంగీకరించలేదని అన్నారు. తమపై విశ్వాసం ఉంచి భారీ 165 నియోజకవర్గాల్లో గెలిపించారని వ్యాఖ్యానించారు. 93 శాతం స్ట్రైక్ రేట్‌తో విజయం సాధించామని చెప్పారు.
ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి..
ప్రతిసారీ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడల్లా ఏదో ఒక సవాల్ ఎదురవుతుంటుందని, ఇప్పుడు మాత్రం ఒకటి రెండు కాదని, ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోన్నామని చంద్రబాబు అన్నారు. ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి అని ఆయన అన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన తొలి రోజుల్లోనే వివిధ శాఖలపై ఏడు శ్వేతపత్రాలు విడుదల చేశామని గుర్తు చేశారు.
అనేక వ్యవస్థలు నిర్వీర్యం
గత అయిదు సంవత్సరాల పాలనలో రాష్ట్రంలో అనేక వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని వ్యాఖ్యానించారు. వాటన్నింటినీ గాడిలో పెట్టడానికే ప్రజలు అధికారం ఇచ్చారని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ఏడు నెలల పరిపాలనలో అదే చేశామని వివరించారు. పాలనను గాడిలో పెట్టడానికి ప్రయత్నిస్తోన్నామని చెప్పారు.
90కి పైగా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్‌లు
కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, ఇతర స్పాన్సర్డ్ స్కీమ్‌లను అనుసంధానం చేసుకుంటోన్నామని చంద్రబాబు వివరించారు. దాదాపుగా 90కి పైగా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్‌లు ఉంటే వాటి నిధులన్నింటినీ కూడా గత ప్రభుత్వం మళ్లించిందని విమర్శించారు. ఇప్పుడు వాటన్నింటినీ సరి చేయాలనే ఉద్దేశంతో ప్రజలు తమకు అధికారాన్ని అప్పగించారని, అధికార యంత్రాంగంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications