అలా చేస్తే పార్టీకి, ప్రభుత్వానికి తీవ్ర నష్టం - సీఎం చంద్రబాబు
టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్లమెంట్ నియోజకవర్గ కమిటీల నియామకంలో పార్టీ నేతలకు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. కమిటీ నియామకాలు పారదర్శకంగా, పకడ్బందీగా జరగాలన్నారు. సామాజిక సమీకరణాలు ఖచ్చితంగా పాటించాలని.. అన్ని వర్గాలకు, బలమైన, చురుగ్గా పనిచేసే నేతలకు అవకాశాలు ఇవ్వాలని తెలిపారు. డమ్మీలు, బలహీనులను కమిటీలలో పెట్టడం వల్ల పార్టీకి, ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం క్యాంప్ కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి 75 మంది ప్రధాన నేతలు, త్రిసభ్య కమిటీల సభ్యులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. కమిటీల నియామకంలో సామాజిక సమీకరణాలు (సోషల్ రీఇంజనీరింగ్) కచ్చితంగా పాటించాలని చెప్పారు. అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించాలని.. అధికారంలో ఉన్నామన్న భావనతో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. చెప్పినట్టే సూపర్ సిక్స్ లోని అన్ని పథకాలను అమలు చేస్తూ సూపర్ హిట్ చేశామన్నారు. ఏడాది కాలంలోనే మ్యానిఫెస్టోలోని అనేక హామీలు నెరవేర్చడంతో ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని సంతృప్తి వ్యక్తం చేశారు.

వైసీపీపై విమర్శలు..
గత ప్రభుత్వం వ్యవస్థలను పూర్తిగా నాశనం చేసిందని, ఎన్నో సవాళ్లను ఎదుర్కొని తాము సంక్షేమాన్ని, అభివృద్ధిని ముందుకు తీసుకెళుతున్నామని చంద్రబాబు తెలిపారు. వైసీపీ ప్రతిపక్షం కాదని.. అదొక విష వృక్షం అని అన్నారు. తప్పుడు ప్రచారాలనే రాజకీయ సిద్ధాంతంగా పెట్టుకున్నారని మండిపడ్డారు.
అమరావతి మునిగిపోయిందని, ప్రకాశం బ్యారేజ్ గేట్లు కొట్టుకుపోయాయని ఫేక్ ప్రచారాలు చేశారని గుర్తు చేశారు. చివరికి సింగయ్యను చంపేసి ఆ నేరాన్ని కూడా ప్రభుత్వంపై నెట్టేందుకు యత్నించారని ఫైర్ అయ్యారు. లక్షల పింఛన్లు తొలగించామని వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని నేతలు సమర్థవంతంగా తిప్పికొట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
అంతే కాకుండా పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించానని చంద్రబాబు స్పష్టం చేశారు. కింది స్థాయి నుంచి పై వరకు బలమైన వ్యవస్థను నిర్మిస్తున్నానని వివరించారు. ఇన్నేళ్లలో అనేక సవాళ్లను ఎదుర్కొని.. అనేక పోరాటాలు చేసి.. ఈ రోజు ఈ స్థానంలో ఉన్నామని తెలిపారు. పార్టీలో ప్రతి ఒక్కరూ చాలా బాధ్యతగా ఉండాలని.. ప్రభుత్వంలో ఉన్నప్పుడు పార్టీ నేతలు మరింత బాధ్యతగా ఉండాలని కోరారు. పార్టీ ఇమేజ్ ను, ప్రభుత్వ ఇమేజ్ ను పెంచేలా నేతల తీరు ఉండాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
ఉండవల్లి నివాసం వద్దనున్న క్యాంప్ కార్యాలయంలో పార్లమెంట్ పార్టీ కమిటీల అంశంపై సీఎం చంద్రబాబు గారు సమావేశం నిర్వహించారు. సమావేశానికి టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, సీనియర్ నేత వర్ల రామయ్యతోపాటు టీడీపీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు గారు పార్లమెంట్ పార్టీ కమిటీలపై… pic.twitter.com/hNSvyXf6ZM
— Telugu Desam Party (@JaiTDP) August 23, 2025












Click it and Unblock the Notifications